కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో భూ కబ్జాలు

land-grabs-in-telangana-won-by-fightingఉద్యోగాలు ఇస్తామన్న సీఎం కేసీఆర్‌కు లక్షావైన్స్‌ టెండర్లపైనే మొగ్గు
– బీజేపీ, బీఆర్‌ఎస్‌ దొందూదెందే..
– 26న చేవెళ్ల సభను విజయవంతం చేయండి
– రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవకావం ఇవ్వండి
– టీపీసీసీ ఏనుముల రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-చేవెళ్ల
నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే, కేసీఆర్‌ మాత్రం భూముల కబ్జాల గురించి ఆలోచిస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేవీఆర్‌ గ్రౌండ్‌లో ఈ నెల 26న నిర్వహించే ఎస్సీ ,ఎస్టీ డిక్లరేషన్‌ సభను విజయవంతం చేయాలని సభ స్థలాన్ని పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరం చుట్టుపక్కల సీఎం కేసీఆర్‌ 10 వేల ఎకరాల వరకు సంపాధించారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్‌, లక్ష వైన్స్‌ టెండర్లు మాత్రం సాధించారని అన్నారు. తెలంగాణలో ముదిరాజులకు తీవ్ర నష్టం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్‌ఎస్‌ పార్టీ నేనని అన్నారు. ఎంఐఎం పార్టీతో కేసీఆర్‌ కుమ్మక్కై తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిం చారు. తెలంగాణ ప్రజలు ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి, బీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలన్నారు. రెండుసార్లు బీఆర్‌ఎస్‌కు అధికారం ఇచ్చారనీ, ఈసారి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు. రాబోయే ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో కారు గుర్తు కనిపించవద్దన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు దొందూదెందోనని విమ ర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధి కారంలోకి వస్తే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఒకప్పుడు పాయింటు, షర్టు లేనోడు ఇవాళ్ళ కోకాపేటలో రూ.100 కోట్లు పెట్టి ఎకరా పొలం కొంటున్నారనీ, అది కూడా కేసీఆర్‌ హయాం లోనే అని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వందల కోట్లతో భూములు కొంటున్నారని, అవి ఎవరి డబ్బులని ప్రశ్నించారు. తెలంగాణలో లక్షల కోట్ల సంపదను కొల్లగొట్టారని, ప్రస్తుతం మధ్యతరగతి వాళ్లు 100 గజాలు కూడా కొనలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో పేదల భూములు లాక్కుని, ఐటీ కంపెనీలకు అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లా నుంచి లక్ష కోట్ల ఆదాయం తెలంగాణకు వస్తోందని, ఇక్కడి పేదల భూములకు రూ.10 లక్షలు ఎకరాకు కట్టించి, అవే భూములను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆగస్టు 26వ తేదీన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్‌ ఖర్గే హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌, ములుగు ఎమ్మెల్యే సీతక్క, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, పార్లమెంట్‌ ఇన్‌చార్జి నరేందర్‌ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షులు పడాల వెంకటస్వామి, టీపీసీసీ సభ్యులు జనార్ధన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఉదరు మోహన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ చేవెళ్ల నియోజక సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం, షాబాద్‌ దర్శన్‌, దేశమొల్ల ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్‌ గుప్తా, పెంటయ్యగౌడ్‌, ఆగిరెడ్డి, సహకార సంఘం చైర్మన్లు దేవర వెంకట్‌ రెడ్డి, గోనె ప్రతాప్‌ రెడ్డి, నక్క బుచ్చిరెడ్డి, పార్టీల మండల అధ్యక్షులు వీరేందర్‌ రెడ్డి, జనార్ధన్‌ రెడ్డి, మణయ్య, చంద్రశేఖర్‌, చేవెళ్ల సర్పంచ్‌ శైలజా అగిరెడ్డి, ఎంపీటీసీలు గుండాల రాములు, మండల మహిళా అధ్యక్షురాలు సమత, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ గంగి యాదయ్య, మాజీ ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.