దేశంలో కోటి మందికి పైగా వృద్ధులకు మతి మరుపు

– ఏఐ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కోటి మందికిపైగా వృద్ధులు మతి మరుపు (డెమెంటియా)తో బాధపడుతున్నారు. అమెరికా, ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలతో సమానంగానూ భారత్‌లోనూ ఈ వ్యాధి ప్రాబల్య రేటు ఉంది. అయితే ఆయా దేశాల్లో మాదిరిగా మనదేశంలో ఈ వ్యాధిని తీవ్రంగా పరిగణించడం లేదు. డెమెంటియా అనేది జ్ఞాపకశక్తి, ఆలోచన, తార్కికం, జడ్జిమెంట్‌ వంటి మానసిక ప్రక్రియల బలహీనతకు దారి తీస్తుంది. తద్వారా రోజువారీ విధులను నిర్వహించే వ్యక్తి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. తాజాగా ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం 2050 నాటికి దేశంలో 60 ఏళ్లు దాటిన వారు మొత్తం జనాభాలో 19.1 శాతం ఉంటారని అంచనా. వృద్ధుల జనాభా పెరుగుదలతో ఈ వ్యాధి బాధితులు కూడా పెద్ద సంఖ్యలో పెరుగుతారు. 31,477 మంది వృద్ధుల నుంచి సేకరించిన సమాచారాన్ని సెమీ-పర్‌వైజ్డ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ అనే కృతమ మేధస్సు (ఎఐ) సాంకేతికత ఉపయోగించి విశ్లేషించారు. దీని ఆధారంగా న్యూరో ఎపిడెమియాలజీ జర్నల్‌లో తాజా పరిశోధన ప్రచురించారు. దేశంలో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్పు ఉన్న వృద్దుల్లో డెమెంటియా ప్రాబల్యం రేటు 8.44 శాతంగా ఉంటుందని పరిశోధకుల బృందం అంచనా వేసింది. ఇది 10.08 మిలియన్ల జనాభాకు సమానం. అలాగే అమెరికాలో 8.8 శాతం, ఇంగ్లండ్‌లో 9 శాతం, జర్మనీలో 8.5 శాతం, ఫ్రాన్స్‌లో 9శాతంగానూ ఈ వ్యాధి ప్రాబల్య రేటుకు సమానంగా భారత్‌లో ఉంది. మహిళలు, నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు ఈ వ్యాధితో ఎక్కువగా బాధపడుతున్నారు.