ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి

Reservations should be made in the private sector– అంటరానితనం, కులవివక్షపై 5 ఏండ్లకోసారి సర్వే చేపట్టాలి
– దళితులకు భూపంపిణీ ఎజెండా కావాలి
– విద్యా రుణాల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి
– ఎస్సీలకు విద్యా, ఉపాధి, వ్యాపారం హక్కు ఉండాలి
– అప్పుడే దేశంలో దళితుల సాధికారత సాధ్యం : జాతీయ దళిత్‌ సమ్మిట్‌లో ప్రొఫెసర్‌ సుఖ్‌దేవ్‌ థోరట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలో అత్యంత వెనుకబడిన ఉన్న దళితులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి కావాలంటే, వారి సాధికారతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మాజీ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ సుఖ్‌దేవ్‌ థోరట్‌ చెప్పారు. ప్రభుత్వరంగంతోపాటు ప్రయివేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో రెండురోజులపాటు నిర్వహించిన జాతీయ దళిత్‌ సమ్మిట్‌ ఆదివారం హైదరాబాద్‌లో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన సుఖ్‌దేవ్‌ థోరట్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా దళితులపై అంటరానితనం, వివక్ష, అణచివేత, దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. 1950 వరకు ఎలాంటి హక్కుల్లేవనీ, బానిసలుగా బతికారని గుర్తు చేశారు. దళితులు చదువుకునే హక్కు లేదు, ఉద్యోగం చేసే హక్కులేదు, సమానంగా జీవించే హక్కు లేదని అన్నారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చాక వారికి హక్కులు కల్పించబడ్డాయని వివరించారు. రాజకీయ రంగంతోపాటు విద్యా, ఉద్యోగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమేననీ, వివక్షను, అంటరానితనాన్ని నిర్మూలించారని అన్నారు. దళితులపై వివక్ష చూపితే శిక్షించేందుకు అట్రాసిటీ చట్టాన్ని తెచ్చారని చెప్పారు. దళితుల జనాభా ఎంత ఉంటే అదే దామాషా ప్రకారం రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ వర్తిస్తుందన్నారు. ఇతరులతో సమానంగా తీర్చిదిద్దేందుకు ఇది కొంత దోహదపడిందని వివరించారు. అందులో భాగంగా దళితులు ఉద్యోగులుగా, అధికారులుగా, మంత్రులుగా అవుతున్నారని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వరంగంలో 20 శాతం ఉద్యోగాలున్నాయని చెప్పారు. ప్రయివేటు రంగంలో 80 శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయని అన్నారు. కానీ అక్కడ రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు. అందుకే ప్రయివేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరముందని కోరారు. భూమి లేని పేదల్లో ఎక్కువ మంది దళితులే ఉన్నారని చెప్పారు. వారికి భూపంపిణీ ఎజెండా కావాలన్నారు. తలసరి ఆదాయంలో ఓబీసీ, ఓసీల కంటే దళితులు తక్కువ స్థాయిలో ఉన్నారని వివరించారు. పేదరికంలో దళితులే అధికంగా ఉన్నారని అన్నారు. అనేక చట్టాలు, పథకాలు అమలు చేస్తున్నా దేశంలో పేదరికం తగ్గడం లేదన్నారు. పేదరికంలో ఓసీలు తొమ్మిది శాతం ఉంటే, దళితులు 30 శాతం ఉన్నారని వివరించారు. భూమి, పక్కా ఇండ్లు, తాగునీరు, డ్రైనేజీ, చదువు, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం ఇలా ఏ రంగంలో చూసినా దళితులు వెనుకబడే ఉన్నారని చెప్పారు. ఉన్నత విద్య చదివే వారు ఓసీలు 41 శాతం ఉంటే, దళితులు 21 శాతం ఉన్నారని అన్నారు. దేశంలో సంపద ఓసీల వద్ద 45 శాతం, ఓబీసీల వద్ద 31 శాతం, ఎస్సీల వద్ద ఏడు శాతం ఉందని వివరించారు. రెగ్యులర్‌ సాలరీ వచ్చే ఉద్యోగుల్లో దళితులు తక్కువగా ఉన్నారని చెప్పారు. అయితే ఎక్కువమంది క్యాజువల్‌ కార్మికులుగా తక్కువ జీతానికి పనిచేస్తున్నారని వివరించారు. దీంతో వారు సొంత ఇల్లు లేక, గౌరవంగా జీవించేందుకు సరిపోను ఆదాయం లేక, పౌష్టికాహారం లేక, పేదరికంలో మగ్గుతున్నారని అన్నారు. దళిత వ్యాపారవేత్తలు, రైతులు కూడా వివక్షను అనుభవిస్తున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో దళితులను దేవాలయాల్లోకి రానివ్వడం లేదనీ, రోడ్లపై తిరగనివ్వబోరనీ, హోటళ్లలో వివక్ష ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంటరానితనం లేని గ్రామాలను తీర్చిదిద్దేందుకు పది గ్రామాలకు ఒక కార్యదర్శిని నియమించాలని సూచించారు. పేదరికం, ఉపాధి, జనగణనపై పదేండ్లకోసారి సర్వే చేస్తున్నట్టుగానే అంటరానితనం, కులవివక్షపైనా ఐదేండ్లకోసారి సర్వే చేయాలని కోరారు. అందరూ సమానమేననంటూ రాజ్యాంగం చెప్తున్నా అందుకు విరుద్ధంగా వ్యవహరించే తీరుపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఎస్సీ రైతుల కోసం ప్రత్యేక రాయితీలు కల్పించాలనీ, వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్‌, ఇతర వస్తువులు కొనేందుకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. భూమి లేని దళితులకు భూపంపిణీ చేయాలనీ, ఇది ఎజెండా కావాలని సూచించారు. ప్రయివేటు విద్యారంగం విస్తరిస్తున్నదనీ, అధిక ఫీజులు, వివక్ష వల్ల అక్కడ దళితులు చదువుకునే పరిస్థితి లేదని చెప్పారు. 45 శాతం విశ్వవిద్యాలయాలు, 65 శాతం కాలేజీలు, 67 శాతం పాఠశాలలు ప్రయివేటురంగంలో ఉన్నాయని వివరించారు. అందరికీ విద్య కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. దళితులకు విద్యా, ఉపాధి, వ్యాపారం హక్కుగా ఉండాలన్నారు. అప్పుడే దళితులు అందరితో సమానంగా అభివృద్ధి చెందుతారనీ, వారిలో సాధికారత సాధ్యమవుతుందని కోరారు.
మణిపూర్‌ సీఎం రాజీనామా చేయాలని తీర్మానం
మణిపూర్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, గిరిజన మహిళలపై లైంగిక దాడులు, హత్యలను జాతీయ దళిత్‌ సమ్మిత్‌ తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాజీ ఎంపీ రామచంద్రడోమ్‌ చెప్పారు. ఆ ఘటనలకు బాధ్యత వహిస్తూ మణిపూర్‌ సీఎం బీరెన్‌సింగ్‌ రాజీనామా చేయాలని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. అక్కడ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ మౌనం వహించడం సరైంది కాదని చెప్పారు. గద్దర్‌ మరణం పట్ల సంతాప సూచకంగా ప్రతినిధులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా మాట్లాడుతూ ఐదు దశాబ్ధాల్లో ఎప్పుడూ లేనిస్థాయిలో ప్రస్తుతం నిరుద్యోగం పెరిగిపోయిందని చెప్పారు. సమానత్వం, అంటరానితనం నిర్మూలన రాజ్యాంగంలో ఉన్నా అమలు కావడం లేదన్నారు. ఇప్పటికీ గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి అమల్లో ఉందని అన్నారు. ఎస్వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ మాట్లాడుతూ కులాంతర వివాహాల ప్రోత్సాహకం కేంద్ర ప్రభుత్వం 500 మందికే ఇవ్వడం సరైంది కాదన్నారు. ఆ నిబంధనను తొలగించాలని డిమాండ్‌ చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ కల్పించాలని కోరారు. కులదురహంకార హత్యలను ఆపాలన్నారు. కులాంతర వివాహాల దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటిని పరిష్కరించాలని సూచించారు. కులాంతర వివాహం చేసుకున్న ఓబీసీలకూ నగదు ప్రోత్సాహకం వర్తింపచేయాలని కోరారు. దళితులు, ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని బీకేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క బాలమల్లేష్‌ విమర్శించారు. రామచంద్ర డోమ్‌, ప్రొఫెసర్‌ కృష్ణ, విక్రంసింగ్‌, పి రామ్‌మూర్తి, సత్యదేవ్‌ రామ్‌, దేవి కుమారి అధ్యక్షవర్గంగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో మల్లేపల్లి లక్ష్మయ్య, విఎస్‌ నిర్మల్‌, ధీరేంద్ర ఝా, గుల్జార్‌సింగ్‌ గోరియా, బి వెంకట్‌, జాన్‌వెస్లీ తదితరులు పాల్గొన్నారు.