ఏది బ్రాండెడ్‌.. ఏది జనరిక్‌..?

Which is branded.. which is generic..?– అధిక ధరలకు జనరిక్‌ మందుల విక్రయాలు
– రూ.కోట్లల్లో ఔషధ వ్యాపారం
– హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో జోరుగా దందా
– పట్టించుకోని ఏడీలు, డీఐలు
రోగుల అవసరాలు, వారి పరిస్థితులను కొంతమంది మెడికల్‌ షాపుల నిర్వాహకులు క్యాష్‌ చేసుకుంటున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి జనరిక్‌ మందులను అధిక ధరలకు అంటగడుతున్నారన్న ఆరోపణలున్నాయి. బ్రాండెడ్‌కు బదులు జనరిక్‌ మందులు ఇస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. ఏది బ్రాండెడ్‌, ఏది జనరిక్‌ మందులో జనం తెలుసుకోలేక మెడికల్‌ షాపుల మాయాజాలంలో పడుతున్నారు. హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లోని ఏడీలు, డీఐలు నామమాత్రంగా దాడులు చేస్తున్నారు తప్ప కఠిన చర్యలకు వెనుకాడుతున్నారన్న విమర్శలున్నాయి. ‘మెడికల్‌ షాపుల మాఫియా’ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా రూ.కోట్లల్లో వ్యాపారం సాగుతోంది.
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో దాదాపు 8 వేల వరకు మెడికల్‌ షాపులు ఉన్నాయి. ఏ మెడికల్‌ షాపులో చూసినా 80శాతం మేర జనరిక్‌ మందులే అందుబాటులో ఉన్నాయి. వైద్యులు రోగులకు ఐదారు రకాల బ్రాండెడ్‌ మందులను రాస్తే.. కొన్ని మెడికల్‌ షాపుల్లో రెండు, మూడు రకాలు మాత్రమే ఇచ్చి మిగతావి జనరిక్‌ ఇచ్చేస్తున్నారు. జనరిక్‌ మందుల్లోనూ బ్రాండెడ్‌ మందుల మాదిరిగా ఫార్ములా ఒకే రకంగా ఉంటుందని, తక్కువ ధరకు లభించే జనరిక్‌ మందులను వాడాలని ప్రభుత్వాలు సైతం సూచిస్తున్నాయి. కానీ, కొంతమంది మెడికల్‌ షాపుల నిర్వాహకులు బ్రాండెడ్‌ ధరలకే జనరిక్‌ మందులు అంటగడుతున్నారు.
ధరల్లో భారీ వ్యత్యాసం
బ్రాండెడ్‌ మందులతో పోల్చితే జనరిక్‌ మందుల ధర తక్కువగా ఉంటుంది. వివిధ రోగాలకు సంబంధించిన మందుల ఫార్ములా ఒక్కటే అయినా బ్రాండెడ్‌ ధరలు 60-80శాతం మేర ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు అలర్జీ కోసం ఉపయోగించే సిట్రిజన్‌ ఫార్ములా కలిగిన ఒకాసెట్‌ ట్యాబెట్ల షీట్‌ (10 గోళీలకు) బ్రాండెడ్‌లో రూ.20కి అమ్ము తుండగా.. జనరిల్‌లో మాత్రం రూ.5కే విక్రయి స్తున్నారు. విటమిన్‌ డి-3, క్యాల్షియం ట్యాబ్లెట్లు (15 గోలీ లకు) బాండెడ్‌ రూ.90కి వియ్రి స్తుండగా, జనరిక్‌లో రూ.20కి అమ్ము తున్నారు. పక్షవాతం వచ్చిన రోగులకు సంబంధించి స్ట్రోసిట్‌ ప్లస్‌ ట్యాబ్లెట్లు (10)కి జనరిక్‌లో రూ. 280కి లభిస్తుండగా.. మెడికల్‌ షాపుల్లో రూ. 600కి అమ్ముతున్నారు. కొన్ని షాపుల్లో డిస్కౌంట్‌ పేరుతో అమ్మకాలను పెంచుకుం టున్నారు.
ఎమ్మార్పీల పేరుతో దగా..
దాదాపు అన్ని మెడికల్‌ షాపుల్లోనూ జనరిక్‌ మందుల విక్రయాలు సాగుతున్నాయి. ఒక్కో జనరిక్‌ స్ట్రిప్‌పై 50శాతం మేర మెడికల్‌ షాపుల నిర్వాహకులు పర్సంటేజీలు పొందుతున్నారు. అసలు విషయం తెలియని రోగులు జనరిక్‌ మందులకు ఎమ్మార్పీ ధర చెల్లిస్తూ మోసపోతున్నారు. జీవన్‌ధార జనరిక్‌ షాపుల్లోనూ మెడికల్‌ షాపుల మాదిరిగా వివిధ రకాల మందుల ఎమ్మార్పీ ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ అక్కడ దాదాపు 70శాతం మేర తక్కువ ధరకు లభిస్తాయి. ప్రజలకు జనరిక్‌ షాపులపై అవగాహన లేక మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేస్తూ దోపిడీకి గురవుతున్నారు. పైగా మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేసిన మందులకు బిల్లులు కూడా ఇవ్వడం లేదు. జనరిక్‌ మందులపై అవగాహన కల్పించాల్సిన డ్రగ్‌ కంట్రోల్‌ ఏడీలు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు ఆ దిశగా కృషి చేయకపోవడంతో మెడికల్‌ మాఫియా రెచ్చిపోతోంది.
నామమాత్రపు తనిఖీలు
హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లోని డ్రగ్‌ కంట్రోల్‌ ఏడీలు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు మెడికల్‌ షాపుల్లో నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది జులై నెలలో కోఠి, అంబర్‌పేట, నాంపల్లి, లంగర్‌హౌస్‌, చార్మినార్‌, హుమాయన్‌నగర్‌, ఉప్పల్‌, గౌలిగూడ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. కొన్ని మెడికల్‌ షాపుల లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేయగా, మరికొన్నింటి లైసెన్స్‌లను రెండు, మూడు వారాలపాటు తాత్కాలికంగా రద్దు చేశారు. ఆ తర్వాత అధికారులు అటువైపే చూడకపోవడంతో బిజినెన్‌ షరా మామాలుగా సాగుతోంది.
ఆయా షాపుల్లో ధరలు ఇలా.. (రూపాయల్లో)
ఔషధం ఎమ్మార్పీ జనరిక్‌ షాపులో.. మెడికల్‌ షాపులో.. వ్యత్యాసం ఎందుకు వాడుతారు
1.అమాక్సిక్లౌవ్‌ 204.84 110 204.84 94.84 యాంటి బయాటిక్‌
2.అజాక్స్‌ 71.63 30 71.63 31.63 యాంటీ బయాటిక్‌
(అజిత్రోమైసిన్‌)
3.పాంటా ప్రజోల్‌ 143.56 25 143.56 118.6 కడుపులో మంట, అల్సర్‌
40 ఎం.జి (పాంటప్రజోల్‌)
4.జింకోవిటా 165 40 165 125 విటమిన్‌
5.క్యాల్షియం, డీ-3 86.50 25 86.50 61.50 ఎముకల బలం
(సిప్‌కాల్‌)
6.ఏసీ మిజ్‌ 108.90 25 -108.90 83.90 నొప్పులు
(ఎసెెక్లోఫెనాక్‌, పారాసిటమాల్‌)
7.సిరఫ్‌, ఆల్‌కాఫ్‌ 93 40 93 53 దగ్గు
8.టెల్మివాక్‌ హెచ్‌ 119.80 35 119.80 84.80 బీపీ
(టెల్మిసార్టాన్‌, హైడ్రో ప్లోరోథయాజిడ్‌)
9.చెస్టోన్‌ కోల్డ్‌ 46.75 25 46.7 21.75 జలుబు, దగ్గు టాబ్లెట్‌
10.వోమిని జెల్‌ 231 140 231 91 నొప్పులకు ఆయింట్‌మెంట్‌