ఉపాధ్యాయుని హత్యకు అనుమానం, అసూయే కారణం

– నలుగురు నిందితుల అరెస్టు
– విలేకరుల సమావేశలో ఏసీపీ బస్వారెడ్డి
నవతెలంగాణ-కూసుమంచి
ప్రభుత్వ ఉపాధ్యాయుడు బైరోజు వెంకటాచారి హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు అనుమానం, అసూయే కారణమని విచారణలో తేలింది. ఇందుకు సంబంధించి కూసుమంచి పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ బస్వారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను సోమవారం వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రానికి చెందిన పగడాల గిరిధర్‌ రెడ్డి, బైరోజు వెంకటాచారిలవి ఎదురెదురు ఇండ్లు. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. గిరిధర్‌రెడ్డిపై మూడు మర్డర్‌ కేసులు, ఒక ఆరాస్‌మెంట్‌ కేసు ఉంది. ఇతడు 2017 సంవత్సరం నుండి 2022 వరకు సస్పెండ్‌ కూడా అయ్యాడు. కాగా అతని స్వభావం సైకిక్‌ డిసార్డర్‌ ఆవేశ పరుడని పోలీసుల విచారణలో తెలింది. చిన్న, చిన్న కారణాలకే అతను గతంలో పలువురి సహాయంతో మర్డర్‌లు చేశాడని పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం తిరుమలగిరి మండలంలోని మొండిచింతబావిలో ఉద్యోగం చేస్తున్నాడు. వెంకటాచారి నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో ఉద్యోగం చేస్తున్నాడు. వెంకటాచారి కుటుంబం వల్లనే తన భార్య తన నుండి విడిపోయి గత 7 సంవత్సరాల నుండి దూరంగా ఉంటుందని కక్ష పెట్టుకున్నాడు. వెంకటాచారి కుటుంబం మాత్రం ఆనందంగా ఉన్నారనే అసూయతో హత్యకు కుట్ర పన్నాడు. సూర్యాపేటకు చెందిన సతీష్‌, మధు, నరేష్‌ అనే వ్యక్తులకు ప్రతి ఒక్కరికి 5లక్షలు ఇస్తానని బేరం కుదుర్చుకున్నాడు. కారు బుక్‌ చేసుకొని 19వ తారీఖు నుండి 22 వరకు హత్యకు ప్రయత్నించి విఫలమయ్యారు. 23వ తారీఖున ఉదయం వెంకటాచారి ద్విచక్రవాహనాన్ని వెంబడించి కూసుమంచి మండలం నాయకన్‌ గూడెం, మందడి నరసయ్యగూడెం దాటిన తర్వాత బ్రిడ్జికి దగ్గరలో కారుతో వెనుక నుండి ఢ కొట్టడంతో అతను కిందపడగా కారులో నుండి దిగిన సతీష్‌, మధు, నరేష్‌లు కత్తులతో నరికి అతి దారుణంగా హత్య చేశారు. కాగా దర్యాప్తులో భాగంగా నేలకొండపల్లి వద్ద ఆదివారం ఉదయం పిఎస్‌ఆర్‌ సెంటర్‌లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులు ఆటో దిగి పారిపోవడానికి ప్రయత్నస్తుండగా, పోలీసులు పట్టుకొని విచారణ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ముద్దాయిల దగ్గర నుండి రెండు కత్తులు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో కూసుమంచి సిఐ జితేందర్‌రెడ్డి, కూసుమంచి, తిరుమలా యపాలెం ఎస్‌ఐలు రమేష్‌ కుమార్‌, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.