‘ఫిన్లాండ్‌’ విద్యలో బోధనా విధానాలను

– అధ్యయనం చేసిన పార్వతీరెడ్డి
నవతెలంగాణ- ఖమ్మం
నగరంలోని హార్వెస్ట్‌ పాఠశాల ప్రిన్సిపల్‌ ఆర్‌. పార్వతి రెడ్డి ఈనెల 21 నుండి 25 వరకు ఫిన్లాండ్‌ స్కూల్‌ విద్యలో బోధనా విధానాలను అధ్యయనం చేసి వచ్చారు. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను ముఖ్యంగా ప్రపంచ దేశాల విద్యా విధానాలకే తలమానికంగా కొనియాడబడుతూ, ప్రపంచ పటంలో అతి చిన్న దేశమే అయినప్పటికీ, ఫిన్లాండ్‌కు ఉన్న ప్రత్యేకత చెప్పుకోదగినదని, అక్కడి విద్యా విధానాల గురించి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను, విద్యావ్యవస్థలోని మెలకువలను అధ్యయనం చేయడానికి, గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సొల్యూషన్స్‌ వారు ఫిల్యాండ్‌ టుర్కూ యూనివర్సిటీలో నిర్వహించిన 6వ ప్రత్యేక సదస్సులో హార్వెస్ట్‌ గ్రూప్‌ ఆఫ్‌ విద్యాసంస్థల ప్రిన్సిపల్‌ ఆర్‌.పార్వతి రెడ్డి ఈనెల 21 నుండి 25 వరకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్కడ విద్యా విధానానికి, మన దేశ విద్యా విధానానికి ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. ఆ దేశంలో నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించటం జరిగిందన్నారు. పిల్లవానికి మొదటి సంవత్సరం నుండే ఇంటిలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ నిర్వహిస్తారు. పిల్లల మీద ఎటువంటి ఒత్తిడి ఉండదని, చదువుతోపాటు సంగీతం, కళలు, ఆటలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని, అలాగే స్కూల్‌ టైం తక్కువ అన్నారు. స్కూళ్లలో ఎప్పుడు కావాలంటే అప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు విశ్రాంతి గదులు ఉంటాయన్నారు. 18 సంవత్సరాల వరకు పూర్తిగా విద్య ఉచితం అన్నారు. అక్కడ టీచర్‌ ఉద్యోగం అంటే ఐఏఎస్‌, ఐపీఎస్‌ తో సమానమని, అక్కడి చట్టాల రూపకల్పనలో ఉపాధ్యాయులది ప్రధాన పాత్ర అన్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఉపాధ్యాయుడు కావాలని కలలుకంటారని, కానీ అదంతా సులభం కాదని, అక్కడ ఉపాధ్యాయుడు కావాలనుకునే వారికి ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ శిక్షణ, ఆరు నెలలు సైన్యంలో, ఒక సంవత్సరం స్కూల్లో ట్రైనింగ్‌ ఉంటుందని, చట్టాలు విధానాల రూపకల్పన, స్వయం రక్షణ, ప్రథమ చికిత్స, అగ్నిమాపక దళంలో 6 నెలల పాటు శిక్షణ, మొత్తం ఏడు సంవత్సరాల శిక్షణ అనంతరం మాత్రమే టీచర్‌గా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తమ పాఠశాల విద్యావిధానానికి, అక్కడి పాఠశాలల విధానాలకి కొంత సారూప్యత ఉందని కో-కరిక్యులర్‌ యాక్టివిటీస్‌, స్ట్రస్‌ ఫ్రీ ఎడ్యుకేషన్‌ ను మేము మొదటినుండి ప్రోత్సహిస్తున్నామని, క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ -పతకాలను సాధించడం గమనార్హమన్నారు.