– టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల్ల కష్ణారెడ్డి
నవతెలంగాణ-మర్రిగూడ
తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగేది నేనేనని,అందులో ఎలాంటి అనుమానం లేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి చలమల్ల కష్ణారెడ్డి అన్నారు. సోమవారం మర్రిగూడ మండలం దామెరభీమనపల్లి, వట్టిపల్లి, మర్రిగూడ, రాజపేటతండా గ్రామాలలో, ప్రజా చైతన్య యాత్ర అనంతరం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మునుగోడు ఉపఎన్నికల్లో తనకు బీఫామ్ ఇవ్వకుండా పాల్వాయి స్రవంతికి పార్టీ బీఫామ్ ఇచ్చిందన్నారు.అప్పుడే పార్టీ అధిష్టానం రానున్న సాధారణ ఎన్నికల్లో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి నేనేనని నిర్ణయం తీసుకుందన్నారు.దానికి అనుగుణంగానే నేను మునుగోడు ప్రజలు బీఆర్ఎస్, బీజేపీ మాయమాటలు నమ్మి మరోసారి మోసపోకుండా ప్రజలను చైతన్య పరచడానికి ప్రజా చైతన్యయాత్రను ప్రారంభించి తన ప్రణాళికను సిద్ధం చేసుకున్నానని పేర్కొన్నారు.కాంగ్రెస్ అధికారం లోకొస్తే మల్లన్నసాగర్,కాళేశ్వరం ప్రాజెక్టుల భూనిర్వాసితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధమైన ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ ప్రకటించిందో అదే మాదిరిగా శివన్నగూడ రిజర్వాయర్ భూనిర్వాసితులకు అందజేస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలో కొస్తే ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ, భార్యాభర్తలకు 4000 రూపాయల పింఛన్,ప్రతి సంవత్సరం రైతుబంధు కింద ఎకరాకు రూ.15 వేలు, ఇండ్లు కట్టుకోవడానికి రూ.6 లక్షల సాయం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముద్దం నర్సింహాగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నక్క తిరుపతయ్య,ఉపాధ్యక్షులు వెన్నమనేని సుధాకర్ రావు, ప్రధాన కార్యదర్శి సిద్దాపురం జంగయ్య, బ్లాక్ కాంగ్రెస్ మండలఅధ్యక్షులు జైపాల్‌రెడ్డి, సిర్పంగి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బేత వెంకటేష్‌యాదవ్, శ్రీనునాయక్ పాల్గొన్నారు.