కుల వివక్ష వ్యతిరేక బిల్లుకు

 Anti-Caste Discrimination Bill - Passed by California Assembly– కాలిఫోర్నియా అసెంబ్లీ అమోదం
వాషింగ్టన్‌ : కుల వివక్ష వ్యతిరేక బిల్లును కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. కుల వివక్షను సమర్ధవంతంగా ఎదుర్కొనాలని, రాష్ట్ర వ్యాప్తంగా అణచివేతకు గురవుతున్న వర్గాలకు రక్షణలను బలోపేతం చేయాలని ఈ బిల్లు కోరుతోంది. సోమవారం అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించి, గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌ వద్దకు పంపింది. ఆయన సంతకంతో ఇది చట్టంగా మారుతుంది. వివక్ష వ్యతిరేక చట్టాల్లో కులాన్ని ఒక రక్షిత కేటగిరీగా చేర్చిన మొదటి అమెరికన్‌ రాష్ట్రంగా కాలిఫోర్నియా నమోదైంది. సెనెటర్‌ అయేషా వహాబ్‌ ఈ ఏడాది ప్రారంభంలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా, రాష్ట్రవ్యాప్తంగా కుల సమానత్వ, పౌర హక్కుల కార్యకర్తలు, సంఘాలు పలువురు మద్దతిచ్చారు. దీర్ఘకాలంగా నెలకొని వున్న వివక్ష నుండి ప్రజలను కాపాడేందుకు తీసుకున్న చర్యకు మద్దతిచ్చినందుకు ఆయేషా హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. కాగా కొయిలేషన్‌ ఆఫ్‌ హిందూస్‌ ఆఫ్‌ నార్త్‌్‌ అమెరికా దీన్ని కాలిఫోర్నియా చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించింది. బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 700కి పైగా సమావేశాలు జరిగాయి. కుల సమానత్వ రక్షణల గురించి ప్రజలు గొంతెత్తి మాట్లాడారు. కుల వివక్షకు గురవుతున్న వారందరూ 20ఏళ్లుగా సంఘటితమై పోరాడుతునే వున్నారని, ఈనాటికి హింసాత్మక దాడులు, వివక్ష నుండి రక్షణ పొందే రోజు వచ్చిందని ఈక్విటీ ల్యాబ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తెన్‌మోయి సౌందరరాజన్‌ వ్యాఖ్యానించారు.