– డిబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్.
నవతెలంగాణ- రాయపోల్
మహిళ, శిశు సంక్షేమ,వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో విద్యాభ్యాసానికి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేసే పథకానికి దరఖాస్తు గడువు ఈ నెల 31 వరకు నిర్ణయించడంతో చాలామంది పేద విద్యార్థులు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోలేకపోయారని ప్రభుత్వం వెంటనే దరఖాస్తు గడువును పొడిగించాలని డిబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ, శిశు సంక్షేమ శాఖ, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అనాధలు, తల్లి లేదా తండ్రి కోల్పోయిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు పిల్లలా సంరక్షణ చూడలేని 18 సంవత్సరాల లోపు విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయనికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఆగస్టు 31 తుదిగడువు నిర్ణయించింది. కానీ విద్యార్థులకు దరఖాస్తు ఫారంతో పాటు జత చేయవలసిన కుల, ఆదాయ ఇతర ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడానికి కార్యాలయల చుట్టూ తిరగడానికి సమయం సరిపోకపోవడంతో ఇంకా చాలామంది విద్యార్థులు కార్యాలయల చుట్టూ తిరుగుతున్నారని, వారందరికీ అవకాశం కల్పించేందుకు ప్రభుత్వ లక్ష్యం నెరవేరడానికి గడువును పొడిగించాలన్నారు. అలాగే దరఖాస్తులను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తీసుకురావడానికి ప్రజలకు ఇబ్బంది అవుతుందని, అలాకాకుండా మండలాల ఐసిడిఎస్ కార్యాలయంలో తీసుకోవాలని డిమాండ్ చేశారు.