ప్రొ కబడ్డీ వేలం వాయిదా

– ఆసియా క్రీడల సన్నద్ధతే కారణం
ముంబయి: ప్రో కబడ్డీ లీగ్‌ (పీకెఎల్‌) పదో సీజన్‌ ఆటగాళ్ల వేలం వాయిదా పడింది. ఈ మేరకు లీగ్‌ నిర్వాహకులు, ప్రసారదారు శుక్రవారం తెలిపారు. హౌంగ్జౌ ఆసియా క్రీడల్లో పతకమే లక్ష్యంగా భారత మెన్‌, ఉమెన్‌ జట్లు శిక్షణ శిబిరంలో సాధన చేస్తున్నాయి. ఓ వైపు ఆసియా క్రీడల సన్నాహాక శిబిరం జరుగుతుండగా.. ప్రొ కబడ్డీ లీగ్‌ ఆటగాళ్ల వేలం అంత మంచిది కాదేమోనని భారత కబడ్డీ సమాఖ్య ప్రతినిధులు లీగ్‌ నిర్వాహకులు తెలిపారు. దీంతో సెప్టెంబర్‌ 9, 10న ముంబయిలో జరగాల్సిన పదో సీజన్‌ ఆటగాళ్ల వేలాన్ని వాయిదా వేస్తున్నట్టు పీకెఎల్‌ నిర్వాహకులు ప్రకటించారు. ఆటగాళ్ల వేలం రీ షెడ్యూల్‌ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.