19 నుంచి ఆదివాసీ జాతీయ మహాసభలు

– తమిళనాడులో నిర్వహణ
– పోస్టర్‌ను విడుదల చేసిన టీజీఎస్‌ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ (ఆర్మ్‌) జాతీయ మహాసభలు ఈ నెల 19నుంచి 21 వరకు తమిళనాడు రాష్ట్రంలోని నమక్కల్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్టు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్‌, ఆర్‌ శ్రీరాంనాయక్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభల పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్మ్‌ కేంద్ర కమిటీ సభ్యులు శ్రీరాంనాయక్‌ మాట్లాడుతూ మహాసభలకు దేశవ్యాప్తంగా 450 మంది ఆదివాసీ ఉద్యమ నాయకులు ప్రతినిధులుగా హాజరవుతున్నారని తెలిపారు. ముఖ్య అతిథులుగా బృందా కారత్‌, ఆర్మ్‌ చైర్మెన్‌ డాక్టర్‌ మిడియం బాబురావు, కన్వీనర్‌ జతిన్‌ చౌదరి పాల్గొంటారని చెప్పారు.మహాసభల ముగింపురోజు ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గిరిజనులకు కల్పించిన రాజ్యాంగ హక్కులను కాల రాస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అడవులు, అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు గత పార్లమెంట్‌ సమావేశాల్లో అటవీ సంరక్షణ చట్టాన్ని ఆమోదించారని గుర్తుచేశారు. దీంతో 10 కోట్ల మంది గిరిజనులు అడవులనుంచి గెంటి వేయబడతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గిరిజన తెగలపై దాడులు, హత్యలు, మహిళలపై సామూహిక లైంగిక దాడులు తీవ్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. డబులింజన్‌ సర్కార్‌ మణిపూర్‌లో గిరిజనులు, గిరిజనేతర ప్రజల మధ్య చిచ్చుపెట్టి మారణహోమం సృష్టించిందని చెప్పారు. కాశ్మీర్‌లో చట్టాలను రద్దు చేసినట్టు 5,6వ షెడ్యూల్డ్‌ ప్రాంతంలో అటవీ భూములపై గిరిజనులకున్న ప్రత్యేక హక్కులన్నింటినీ రద్దు చేసే కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఆదివాసీ సంస్కృతి ,ఆచారాలు, ఆహార అలవాట్లపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దాడి చేస్తూ మనువాద సంస్కృతిని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం బాలు నాయక్‌, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఆర్‌.పాండు నాయక్‌, నాయకులు గోపీ నాయక్‌, గోర్యా నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.