– పర్యావరణ నిబంధనలకు తూట్లు
– కేంద్ర మాజీమంత్రి జవదేకర్ ప్రమేయం
– దొడ్డిదారిన మార్పులు
– ఓసీసీఆర్‌పీ రిపోర్ట్
న్యూఢిల్లీ : కార్పొరేట్ల మోసాలు, అక్రమాలకు మోడీ సర్కార్ దన్నుగా నిలుస్తోందని.. వారి లాబీయింగ్‌కు తలొగ్గుతోందని ఓసీసీఆర్‌పీ రిపోర్ట్ స్పష్టం చేసింది. అదానీ అక్రమాలు, ఆర్థిక మోసాలను బయటపెట్టిన లాభాపేక్షలేని సంస్థ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ (ఓసీసీఆర్‌పీ) తాజాగా మైనింగ్ వ్యాపార దిగ్గజం అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూపు ప్రభుత్వంతో చేసిన తెరచాటు లాబీయింగ్‌ను బయటపెట్టింది. కరోనా సమయంలో కీలక పర్యావరణ నిబంధనలను బలహీనపర్చేందుకు రహస్య లాబీయింగ్ చేసిందని ఒసిసిఆర్‌పి తన రిపోర్ట్‌లో వెల్లడించింది. సొంత షేర్లలో అదానీ కుటుంబం అజ్ఞాత పెట్టుబడులతో భారీగా అక్రమాలకు పాల్పడి పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్లు ఆరోపించిన ఓసీసీఆర్‌పీ.. మరుసటి రోజే వేదాంత గ్రూపు మోసాలను బయటపెట్టింది.
జనవరి 2021లో వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ అప్పటి పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్‌తో మోసపూరిత సంప్రదింపులు చేసిందని తెలిపింది. కొత్త పర్యావరణ అనుమతులు పొందకుండానే మైనింగ్ కంపెనీలు 50 శాతం వరకు ఉత్పత్తిని పెంచుకోవడానికి ప్రభుత్వంతో లాబీయింగ్ చేశారని తేలింది. దీంతో ప్రపంచ వేదికలపై భారత్ మరింత కఠినమైన పర్యావరణ చట్టాలపై దృష్టి సారిస్తుందని బీజేపీ సర్కార్ చెప్పుకుంటున్న గొప్పలు.. వాస్తవానికి సత్య దూరంగా, కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయని నిరూపితమయ్యింది. ఒసిసిఆర్‌పి రిపోర్ట్ ప్రకారం.. ”పర్యావరణ నిబంధనలకు వేదాంత రహస్యంగా తూట్లు పొడిచేందుకు ప్రయత్నించింది. కొత్తగా ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా మైనింగ్ కంపెనీలు తమ ఉత్పత్తిని 50 శాతం పెంచుకునేలా వేదాంత చేసిన రహస్య లాబీయింగ్ చేసింది. ఇందుకోసం 2021లో వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ అప్పటి పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు లేఖ రాశారు. పర్యావరణ అనుమతులను ఎత్తివేయడం ద్వారా ఉత్పత్తి, ఆర్థిక వృద్థిని తక్షణమే పెంచడమే కాకుండా, ఇది ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని, ఉద్యోగాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. తదుపరి పర్యావరణ క్లియరెన్స్ కోసం దరఖాస్తు చేయకుండా కంపెనీలను 50 శాతం ఎక్కువ ఉత్పత్తి చేయడానికి అనుమతించడానికి సాధారణ నోటిఫికేషన్ జారీ చేయాలని అగర్వాల్ తన లేఖలో సూచించారు. వేదాంత ప్రతిపాదించిన రహస్య మార్పులను భారత ప్రభుత్వం ఆమోదించింది. దొడ్డిదారి పద్ధతుల ద్వారా వాటిని అమలు కూడా చేసింది.” అని ఓసీసీఆర్‌పీ వెల్లడించింది.
పీఎంఓ నుంచి ఒత్తిడి..!
”అగర్వాల్ లేఖపై వివిఐపి లేదా చాలా ముఖ్యమైందని గుర్తు పెట్టిన మంత్రి జవదేవకర్.. అతని మంత్రిత్వ శాఖ కార్యదర్శి, అటవీశాఖ డైరెక్టర్ జనరల్‌తో విధాన సమస్యను చర్చించమని చెప్పారు. జావదేకర్‌కు అగర్వాల్ లేఖ రాసిన తర్వాత.. వేదాంత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సునీల్ దుగ్గల్ నేరుగా ప్రధాని నరేంద్ర మోడీకి ఇదే విషయమై లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న పర్యావరణ క్లియరెన్స్ మోడల్‌ను తొలగించడం ద్వారా వెంటనే ఆర్థిక వృద్థిని పెంచవచ్చని అందులో పేర్కొన్నారు. మోడీ కార్యాలయం ఈ లేఖను పర్యావరణ శాఖ కార్యదర్శికి పంపింది. పర్యావరణ అనుమతుల నిబంధనల్లో మార్పులకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి అంతర్గత వ్యతిరేకత వచ్చింది. కాగా.. అనీల్ అగర్వాల్ లాబీయింగ్‌తో ప్రభుత్వ వర్గాలు, మైనింగ్ కార్యదర్శి కూడా నిబంధనలను సడలించాలని ఒత్తిడి చేశారు. అగర్వాల్‌కు అనుకూలంగా దొడ్డిదారిన నిబంధనలు సడలించారు. ఎటువంటి బహిరంగ చర్చ లేకుండా.. అతి సులభంగా ముఖ్యమైన నిబంధనలను సవరించడం ద్వారా ప్రభుత్వం కూడా చట్టాన్ని ఉల్లంఘించి ఉండవచ్చు.” అని ఓసీసీఆర్‌పీ రిపోర్ట్ వెల్లడించింది.
ప్రజలు వ్యతిరేకించిన..
”వేదాంత గ్రూపు వివాదస్పద చమురు ప్రాజెక్టుల పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత నెలకొన్నప్పటికీ.. ప్రభుత్వంతో లాబీయింగ్ ద్వారా ముందుకు సాగింది. వేదాంతకు చెందిన చమురు వ్యాపార కంపెనీ కెయిర్న్ ఇండియా వేలంలో దక్కించుకున్న ఆయిల్ క్షేత్రాల్లో అన్వేషణాత్మక డ్రిల్లింగ్ కోసం ప్రజాభిప్రాయ సేకరణలను రద్దు చేయడానికి విజయవంతంగా లాబీయింగ్ చేసుకుంది. ఆ విధంగా రాజస్థాన్‌లో ఆరు వివాదాస్పద ఆయిల్ ప్రాజెక్టులను దక్కించుకుంది.” అని ఓసీసీఆర్‌పీ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. భారత్‌లో ‘లాబీయింగ్’ చట్టబద్దం కాదు. అలాగని ప్రభుత్వం, కార్పొరేట్ల మధ్య ఇలాంటి సంబంధాలను నియంత్రించే నిబంధనలు లేకపోవడం గమనార్హం. ఈ రిపోర్ట్ పైన అనీల్ అగర్వాల్, పీఎంఓ, మాజీ మంత్రి జవదేకర్ స్పందించాల్సి ఉంది. కాగా.. 2016 నుంచి 2020 కాలంలో వేదాంత ట్రస్టులు బీజేపీకి రూ.50 కోట్ల విరాళాలు అందించింది.