ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి

– తహశీల్దార్ వీరగంటి మహేందర్

నవతెలంగాణ పెద్దవంగర: అర్హులైన యువతి యువకులు ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని తహశీల్దార్ వీరగంటి మహేందర్ అన్నారు. రెండో ఓటరు జాబితా సవరణలో భాగంగా ఆదివారం మండల పరిధిలోని పెద్దవంగర, వడ్డెకొత్తపల్లి, అవుతాపురం, ఉప్పెరగూడెం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఓటర్ల జాబితా కార్యక్రమాన్ని తనిఖీ చేసి, బీఎల్ఓ లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. మండలంలో పీడబ్ల్యుడీ ఓటరు జాబితా వివరాలను సేకరించాలన్నారు. పొరపాటున ఎవరినైనా తొలగించి ఉంటే వారిని వెంటనే తిరిగి నమోదు అయ్యేలా చూడాలన్నారు. పకడ్బందీగా ఓటర్ల జాబితాను రూపొందించాలని, జాబితాలో ఓటరు తొలగింపులు, చేర్పులకు సంబంధించిన నిబంధనలను విధిగా పాటించాలన్నారు. కార్యక్రమంలో బీఎల్ఓలు కుమారస్వామి, ఆకారపు మహేష్, ఎడవెల్లి మంజూల, ఏదునూరి సంతోష్, పరుశరాములు, రవి, పాషా తదితరులు పాల్గొన్నారు.