తమ్ముడికి ‘బేబీ’, నాకు ‘ఖుషి’

టాలీవుడ్‌ లేటెస్ట్‌ సూపర్‌ హిట్‌ మూవీ ‘ఖుషి’ కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 30.1 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించిన ఈ సినిమా రెండో రోజుకు రూ. 51 కోట్లను ఆర్జించింది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొం దించిన ఈ సినిమా యూఎస్‌ బాక్సాఫీస్‌ వద్ద కూడా ఇదే జోరులో ఉంది. రెండో రోజునే ఈ సినిమా వన్‌ మిలియన్‌ డాలర్స్‌ ఫీట్‌ సాధించింది. ఈ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో ‘ఖుషి’ మూవీ టీమ్‌తోపాటు హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ‘ఈ ఏడాది మా ఫ్యామిలీకి చాలా కలిసొచ్చింది. మా బ్రదర్‌ ‘బేబీ’ మూవీ, నేను నటించిన ‘ఖుషి’ రెండు సక్సెస్‌ అయ్యాయి. అందుకు దేవుడికి కతజ్ఞతలు తెలిపాం. మా మైత్రీ సంస్థకు కూడా ఈ ఏడాది కలిసొచ్చింది. వాళ్ల రెండు సినిమాలకు నేషనల్‌ అవార్డ్స్‌ వచ్చాయి. అలాగే ఇప్పుడు ‘ఖుషి’ హిట్‌ అయ్యింది’ అని అన్నారు.

– విజయ్ దేవరకొండ