స్థానికతను చాటిన ప్రపంచ కవి

జయంత మహాపాత్ర ఒరిస్సాలోని కటక్‌లో దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి, భౌతిక శాస్త్రం చదువుకుని అనేక ప్రభుత్వ కళాశాలల్లో మూడున్నర దశాబ్దాలకుపైగా దాన్నే బోధించాడు. ఆలస్యంగా, తన 38వ ఏట అభౌతిక కవిత్వం వైపు దష్టి మరల్చాడు. 40వ ఏట అతని కవిత్వం తొలిసారిగా వెలువడింది. ఆ తర్వాత 27 సంపుటాలుగా వెల్లువెత్తింది. ‘రిలేషన్‌షిప్‌’ దీర్ఘ కవితకు 1981లో సాహిత్య అకాడమీ అవార్డు పొంది, ఇంగ్లీషు భాషా విభాగంలో ఆ బహుమతి సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు. (2009లో పద్మశ్రీ వచ్చినప్పటికీ దేశంలో చెలరేగుతున్న అసహనానికి నిరసనగా 2015లో తిరిగి ఇచ్చేశాడు.) ఎ.కె.రామానుజన్‌, ఆర్‌.పార్థసారథిలతో కలిసి భారతీయ ఆంగ్ల కవిత్వానికి పునాదులు వేసిన మహాకవి జయంత మహాపాత్ర తన 94వ ఏట మరో లోకంలోని నదులతో ఏకాంత జ్ఞాపకాలను కలబోసుకోవడానికి తరలిపోయారు. వాల్ట్‌ విట్మన్‌, రవీంద్రనాథ్‌ టాగూర్‌ సహా ఎవరి కవిత్వాన్నీ పెద్దగా చదవకపోయినా, ఒరియా సామాజిక, సాంస్కతిక జీవితంలోని సామాన్యుల భావోద్వేగాలతో పెనవేసుకున్న ఆయన కవిత్వం స్వచ్ఛమైన స్థానీయతను ప్రపపంచానికి చాటిచెప్పింది.

– దేశరాజు, 9948680009