బాలికల తొలి కవితా సంకలనం ‘కొత్త కలాలు’

బాలల మానసిక వికాసానికి తోడ్పడే చక్కని బాల సాహిత్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రధానంగా కుటుంబం, పరిసరాలు, ఉపాధ్యాయులతో పాటు బాల సాహిత్యకారుల మీద ఎంతో ఉంది. ఏ దేశమైతే బాలల్ని, వారి సాహిత్యాన్ని నిర్లక్ష్యం చేస్తుందో, ఆ దేశం ఆ జాతి అభివద్ధిని ఊహించలేం. రేపటి తరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే మహత్తరశక్తి బాల సాహిత్యానికి ఉంది. పిల్లల్లో జ్ఞాన పిపాస ఎక్కువగా ఉంటుంది. వినాలని, తెలుసుకోవాలని, ఏదో చేయాలని, గుర్తించ బడాలని రకరకాల ఆసక్తులు ఉంటాయి. ముఖ్యంగా పిల్లల్లో అనుకరణ గుణం ఎక్కువగా ఉంటుంది.
బాల్యం అమూల్యమైనది. అట్టి బాల్యానికి భరోసాని ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. ఆటలు, పాటలు, మాటలు ఇలా వినూత్నమైన కార్యక్రమాల ద్వారా బాలలను ప్రోత్సహించాలి. అందులో భాగంగా బాలల వికాసానికి దోహదపడేది బాలసాహిత్యం. అందులో భాగంగానే పిల్లలను ప్రోత్సహిస్తూ వారిలో సజనాత్మకతను వెన్ను తట్టి వారి ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక బాలికోన్నత తెలుగు ఉపాధ్యాయిని శివునూరి లతా కష్ణ. కేవలం బాలికల చేత 82 కవితలు రాయించి ఒక దగ్గరకు చేర్చి ”కొత్త కలాలు” పేరుతో తొలి కవితా సంకలనం వెలువరించారు .
”మనిషికి ఉండాలి మంచితనం
తెస్తుంది అది గొప్పతనం
అందరికీ ఉండాలి విద్యా ధనం” అంటూ మంచితనం గురించి చిన్నారి విజయశ్రీ ”నిండుదనం” కవితలలో చక్కగా వివరించింది.
ఓటమి మలుపు
గెలుపును కలుపు
గురువుల తెలుపు
మన మేలుకొలుపు అంటూ చిన్నారి మానస ”మేల్కొలుపు” కవితను చక్కగా రాసింది.
చదువుల తల్లి రావమ్మా
చదువును మాకు ఇవ్వమ్మా
జ్ఞానం నాకు ఇవ్వమ్మా అంటూ అఖిల ”చదువుల తల్లిని” స్తుతించింది.
తెలుగులోని మాటలు
బంగారు మాటలు అంటూ తెలుగు గొప్పతనాన్ని కే అశ్విత తెలియజేసింది.
నల్లని రంగులో మిల మిల మెరుస్తూ
తెల్లని అక్షరాలతో చెరిపేసి
విషయాలను వివరించే
ఉపాధ్యాయుల అస్త్రం అని నల్లబల్ల గురించి స్రవంతి తన ”నల్లబల్ల” కవితలో చక్కగా ఆవిష్కరించింది.
దేశ సరిహద్దుల్లో జవాన్‌
ఊరి పొలిమేరలో కిసాన్‌
బ్రతుకు నిచ్చేది జవాన్‌
మెతుకు నిచ్చేది కిసాన్‌ ”జై జవాన్‌ జై కిసాన్‌” లో వర్షారెడ్డి చక్కగా సైనికుడు, రైతు గురించి తెలియజేసే ప్రయత్నం చేసింది.
ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి కవిత ఒక ఆణిముత్యం లాంటిది. చిన్న కవితలైన కూడా చక్కటి సందేశాన్ని చిన్నారి విద్యార్థులు తెలియ జెప్పే ప్రయత్నం చేశారు ఇప్పుడే సాహిత్యంలోకి వస్తున్నారు కాబట్టి ఇక ముందు ముందు మంచి కవితలు ఎన్నో రాయాలని చిన్నారులను అభినందిస్తూ, వారికి ఆశీస్సులు. అలాగే వారిని నిత్యం వెన్నంటి ఇలాగే మరెన్నో కవితలు రాసే విధంగా లలితకష్ణ ప్రోత్సహించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేద్దాం.

– యాడవరం చంద్రకాంత్‌ గౌడ్‌
9441762105