– డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు అర్హత
– సెప్టెంబర్ 16,17న పతక వేట
యూజీన్ (అమెరికా): ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు భారత్ నుంచి ముగ్గురు అథ్లెట్లు అర్హత సాధించారు. సెప్టెంబర్ 16, 17న అమెరికాలోని యూజీన్‌లో జరుగనున్న ఫైనల్స్‌లో భారత్ నుంచి ముగ్గురు అథ్లెట్లు పతక వేటలో నిలువనున్నారు. ప్రపంచ జావెలిన్ త్రో సూపర్‌స్టార్, భారత అథ్లెటిక్స్ హీరో నీరజ్ చోప్రా సహా స్ప్రింటర్ అవినాశ్ సబ్లె, జంపర్ మురళీ శ్రీశంకర్లు డైమండ్ లీగ్ ఫైనల్లో పోటీపడనున్నారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు ప్రత్యేకత ఉంది. 14 పోటీల సిరీస్ అనంతరం అగ్రస్థానంలో నిలిచిన అథ్లెట్లు మాత్రమే డైమండ్ లీగ్‌కు అర్హత సాధిస్తారు. ఈ ఏడాది మే నెలలో మొదలైన డైమండ్ లీగ్ పోటీలు.. ఈ సెప్టెంబర్‌తో ముగియనుంది. డైమండ్ లీగ్‌లో 16 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. ప్రతి టోర్నీ (14 టోర్నీలు)లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు వరుసగా 8, 7, 6, 5, 4, 3, 2, 1 చొప్పున పాయింట్లను కేటాయిస్తారు. చాంపియన్‌కు ఎనిమిది పాయింట్లు దక్కగా.. ఎనిమిదో స్థానంలో నిలిచిన అథ్లెట్‌కు ఒక్క పాయింట్ దక్కుతుంది. 14 టోర్నీలు ముగిసిన అనంతరం సాధించిన పాయింట్ల ఆధారంగా ఫైనల్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లను తేల్చుతారు. ఒలింపిక్, వరల్డ్ చాంపియన్ నీరజ్ చోప్రా.. దోహా, లాసానె, జ్యురిచ్లలో మాత్రమే పోటీపడ్డాడు. జాకబ్ (చెక్ రిపబ్లిక్) 29, జులియన్ వెబర్ (జర్మనీ) 25 తర్వాత నీరజ్ చోప్రా 23 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఇక లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ 14 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. 3000మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాశ్ సబ్లె ఆరో స్థానంతో ఫైనల్స్‌కు చేరుకున్నాడు. మూడు టోర్నీల్లో పోటీపడిన అవినాశ్ 11 పాయింట్లు సాధించాడు. ఇక ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌లో పసిడి పతకం దిశగా సన్నద్ధమవుతున్న నీరజ్ చోప్రా.. విదేశాల్లో శిక్షణ పొందుతుండగా.. అవినాశ్, శ్రీశంకర్ సైతం ఫైనల్లో పతకంపై కన్నేసి సాధన చేస్తున్నారు.