పాత్రికేయులపై కేసులు రాజ్యాంగ విరుద్ధం : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : మణిపూర్‌లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఎడిటర్స్‌ గిల్డ్‌ (ఈజీఐ) తరఫున పర్యటించిన ప్రతినిధి బృందంపై పోలీసులు కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈజీఐ అధ్యక్షురాలు సీమా ముస్తఫా, పాత్రికేయులు సీమా గుహ, భరత్‌ భూషణ్‌, సంజరు కపూర్‌తో కూడిన ప్రతినిధి బృందంపై మణిపూర్‌ పోలీసులు ఐపీసీలోని వివిధ సెక్షన్లు, ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66-ఏ కింద కేసులు నమోదు చేశారు. మణిపూర్‌ హింసపై స్థానిక మీడియాలో వచ్చిన వార్తలు ఏకపక్షంగా ఉన్నాయని, ఇంటర్‌నెట్‌పై చాలా కాలం పాటు నిషేధం విధించడంతో పాత్రికేయులు సమతూకమైన అభిప్రాయానికి రావడం కష్టమైందని ఈజీఐ ప్రతినిధి బృందం అభిప్రాయపడింది. కాగా ఈజీఐ బృందం రాష్ట్రంలో మరిన్ని ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ఆరోపించారు.