– బడ్జెటరీ కేటాయింపులో అలసత్వం
– కేటాయించిన నిధులనూ ఖర్చు చేయని వైనం
న్యూఢిల్లీ: గత దశాబ్ద కాలంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ఇది సంతోషించదగిన విషయమే అయినప్పటికీ ఈ పథకాలు, కార్యక్రమాలకు అవసరమైన బడ్జెటరీ కేటాయింపులు మాత్రం చేయడం లేదు. వాటి అమలుపై అధికార యంత్రాంగం కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మన దేశంలో శిశువు జన్మించినప్పటి నుండే లింగ అసమానతలు ప్రారంభమవుతున్నాయి. ఆడపిల్ల పుట్టిందంటేనే పెదవి విరుపులు. ఆ తర్వాత వనరులు, సౌకర్యాల విషయంలో వివక్ష. విద్య, ఆరోగ్య రక్షణ వంటి రంగాలలోనూ చిన్నచూపే. సమాన పనికి సమాన వేతనమనేది అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది.
‘సంబల్’దీ అదే దారి
2020-21లో కేంద్రం ‘వన్ స్టాప్ సెంటర్’ పేరుతో మరో పథకాన్ని ప్రారంభించి రూ.160 కోట్లు ఖర్చు చేసింది. మహిళల రక్షణ, సాధికారత కోసం దీనిని ఉద్దేశించారు. అయితే దీనిని ఆ తర్వాత వివిధ పథకాలతో కలిపేశారు. వీటన్నింటినీ కలగలిపి ‘సంబల్’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఏ పథకానికి విడిగా ఎంత కేటాయించారో తెలియడం లేదు. బేటీ బచావ్ బేటీ పఢావ్, వన్ స్టాప్ సెంటర్, నారీ అదాలత్, మహిళా పోలీస్ వాలంటీర్, ఉమెన్స్ హెల్ప్‌లైన్…ఇలా అన్ని పథకాలకూ కలిపి ‘సంబల్’ పేరిట 2021-22లో రూ.587 కోట్లు కేటాయించారు. ఖర్చు చేసింది మాత్రం రూ. 183 కోట్లు. తర్వాతి సంవత్సరాలలో కేటాయింపుల ను కూడా రూ.562 కోట్లకు కుదించారు. ఈ పథకాలకు బడ్జెటరీ కేటాయింపుల్లో సరైన ప్రాధాన్యత లభించడం లేదన్నది వాస్తవం. కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయకపోవడంతో తదుపరి సంవత్సరాలలో కేటాయిం పుల్లో మరింత కోత పెడుతున్నారు.
ఆందోళనకరంగా నేరాల రేటు
మరోవైపు దేశంలో మహిళలపై అకృత్యాలు, అఘాయిత్యాలు, వేధింపులు పెరిగిపోతున్నాయి. లైంగిక వేధింపుల కేసులు భారీగానే నమోదవుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో తాజా నివేదిక ప్రకారం ప్రతి లక్ష జనాభాలో మహిళలపై నేరాల రేటు 2020లో 56.5 ఉంటే 2021లో 64.5కు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2021లో మహిళలపై అత్యాచారం లేదా సామూహిక అత్యాచారం జరపడంతో పాటు వారిని హతమార్చిన ఘటనలు 293 జరిగాయి.
ఏం చేయాలి?
నిర్భయ, సంబల్ వంటి కార్యక్రమాలు మహిళలకు అవసరమైన భద్రతను అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కావాల్సింది అధికారుల్లో చిత్తశుద్ధి. ప్రభుత్వం కూడా అవసరమైన నిధులు కేటాయించడంతో పాటు వాటిని సరిగా ఖర్చు చేయడంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. గతంలో జరిగిన పొరబాట్లను గుర్తించి వాటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మహిళల కోసం రూపొందించిన పథకాలు, కార్యక్రమాలు సత్ఫలితాలను అందిస్తాయి.
‘నిర్భయ’లో కోతలు
మహిళల కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్నామని మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటు న్నప్పటికీ వాటికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు మాత్రం చేయడం లేదు. 2013-14లో మహిళల కోసం ప్రత్యేక పోలీస్ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసేందుకు, వారికి ప్రయాణాలలో భద్రత కల్పించేందుకు కేంద్రం ‘నిర్భయ’ పేరిట కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. దీనికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే 2017-18, 2018-19, 2019-20 సంవత్సరాలలో రూ.550 కోట్ల చొప్పున మాత్రమే కేటాయింపులు జరిపింది. 2021- 22, 2022-23లో మరింత కోత పెట్టి రూ.500 కోట్ల చొప్పున కేటాయించింది. పోనీ కేటాయించిన నిధులనైనా సరిగా ఖర్చు చేస్తున్నారా అంటే అదీ లేదు. 2023 ఏప్రిల్ 23 నాటికి ఈ నిధికి రూ.12,008.5 కోట్లు కేటాయించి నప్పటికీ రూ.4,923 కోట్లు మాత్రమే విడుదల చేశారు. అందులోనూ రూ.2,521 కోట్లు ఖర్చు చేశారు. అంటే కేటాయించిన సొమ్ములో 21%, విడుదల చేసిన నిధులలో 51% మాత్రమే ఖర్చు పెట్టారు.