– 17న పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభ
– ఐదు హామీల ప్రకటన
– కాంగ్రెస్ సభ ఏర్పాట్లు పరిశీలించేందుకు 6న కేసీ వేణుగోపాల్ రాక
– సోనియా, ఖర్గే, రాహుల్‌కు రేవంత్ ధన్యవాదాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో టీపీసీసీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడ్య్లుసీ) సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలన్న టీపీసీసీ విజ్ఞప్తిమేరకు ఏఐసీసీ సోమవారం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అందుకనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల సభను తలపించేలా ఏర్పాట్లు చేయడంతో అందుకు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించాలని భావిస్తున్నది. ఈ ప్రతిష్టాత్మకమైన సమావేశాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈ నెల 6న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌కు రానున్నారు. సీడ్య్లుసీలోకి ఎక్కవ మంది సభ్యులను తీసుకుని విస్తృతపరించిన తర్వాత తొలి సమావేశాలు హైదరాబాద్‌లో జరగడం గమనార్హం. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, బీజేపీ జమిలి ఎన్నికల ప్రస్తావనపై, ఇండియా కూటమి బలోపేతం, పార్లమెంటు ఎన్నికలు, ఐదు రాష్ట్రాల ఎన్నికలు తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 16న సీడ్య్లుసీ సమావేశం, 17న సీడ్య్లుసీ సభ్యులతోపాటు, అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశం జరగనుంది. అదే రోజు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఇప్పటికే ఆ గ్రౌండ్‌ను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం పరిశీలించింది. వేదికపై ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకగాంధీతోపాటు పలువురు సీనియర్ నేతలు కూర్చొనున్నారు. తెలంగాణలో అమలు చేయబోయే ఐదు కీలకమైన హామీలను బహిరంగ సభలో ప్రకటించడం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించనుంది. సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్ర విలీన దినోత్సవాన్ని జరుపుకుంట్ను నేపథ్యంలో ఈ సభకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. అందుకే భారీ సంఖ్యలో జన సమీకరణ చేయాలని పార్టీ నాయకులను ఏఐసీసీ ఆదేశాల్చినట్టు తెలిసింది.
బీజేపీ పతనం ప్రారంభమైంది : రేవంత్‌రెడ్డి
దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో జరగనున్న సీడ్ల్యూసీలో ఇండియా కూటమి గెలుపొందడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనుందని తెలిపారు. సీడ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించాలంటూ ఏఐసీసీకి లేఖ రాసినట్టు తెలిపారు. దానికి ఒప్పుకుని నిర్ణయం తీసుకున్నందుకు వారికి రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. రజాకార్ల చేతిలో ఖర్గే కుటుంబం చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల కలను నిజం చేసిన కాంగ్రెస్ పార్టీ చారిత్రకంగా తెలంగాణకు ఎంతో ముఖ్యమైందన్నారు.