– అంబేద్కర్ సేనా జిల్లా అధ్యక్షులు మహేశ్, జగన్
నవతెలంగాణ-శంకర్‌పల్లి
అనేక సమస్యలతో సతమతమవుతున్న విద్యార్థులందరూ సమాన విద్యా కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని అంబేద్కర్ సేనా జిల్లా అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు మహేష్, జగన్ పిలుపునిచ్చారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల కేంద్రంలోని వివేకానంద జూనియర్ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్టంలో విద్యార్థులు అనేక సమస్యలతో సతమ తమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించడంపై తీవ్రంగా ఖండిస్తామన్నారు. సమాన విద్యా కోసం నిర్వహించే పోరాటంలో విద్యార్థులు, విద్యాసంస్థలు, విద్యాధికారులు సహకరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ వెంటనే విడుదల చేయాలన్నారు. విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని కోరారు. బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేసి, ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ పూర్తి స్థాయిలో దుస్తులు, పుస్తకాలు అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చి దిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ డివిజన్ అధ్యక్షులు జగన్, విద్యార్థులు పాల్గొన్నారు.