మైనార్టీ బంధు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకొనే అవకాశం ఇవ్వాలి

– ఆవాజ్‌ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ నబి
– కలెక్టరేట్‌ ఎదుట మైనార్టీల ధర్నా, అధికారులకు మెమోరండం అందజేత
నవతెలంగాణ-పాల్వంచ
మైనార్టీ బందు కోసం అర్హులందరికీ కొత్తగా దరఖాస్తు చేసుకొనే అవకాశం ఇవ్వాలని ఆవాజ్‌ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ నబి డిమాండ్‌ చేశారు. అర్హులైన వారందరికీ మైనార్టీ పథకం కింద రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేయలని, కొత్త దరఖాస్తులు చేసుకొనే అవకాశం ఇవ్వాలని కలెక్టరేట్‌ ఎదుట ఆవాజ్‌ జిల్లా కమిటీ అధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ధర్నా శిబిరం వద్దకు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సంజీవ రావు చేరుకొని ఈ డిమాండ్లలోని అంశాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ధర్నా కార్యక్రమంలో ఆవాజ్‌ జిల్లా అధ్యక్షులు రహీం అధ్యక్షతన జరిగిన సభలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ నబి మాట్లాడుతూ మైనార్టీ బందు పథకంలో ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధుల జోక్యం ఉండరాదని, కలెక్టర్‌ పారదర్శకంగా అర్హులను గుర్తించి ఈ పథకం వర్తింప జేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న వారందరూ తమ దరఖాస్తులు, సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డీఎండబ్ల్యుఓకి అందజేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డా రవికుమార్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్‌ జిల్లా ఉపాధ్యక్షులు నిరంజన్‌, సహాయ కార్యదర్శి అబ్దుల్‌ రెహమాన్‌, సలీం హుస్సేన్‌ ఖాదర్‌, అంజాద్‌, షాకిర్‌, రంజాన్‌ బీ, పాషా, అఫ్సర్‌, రియాజ్‌, రజియా సుల్తానా, హుస్సేన్‌ బీ, గౌస్‌ పాషా, ఆసియా తదితరులు పాల్గొన్నారు.