రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వినయ్ రెడ్డి

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణంలోని జంబి హనుమాన్ దేవాలయ ప్రాంగణం నుంచి దాదాపు 100 కార్లతో హైదరాబాదులోని గాంధీభవన్లో టిపిసిసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి కార్యకర్తలతో శుక్రవారం ర్యాలీగా బయలుదేరారు. నియోజకవర్గానికి చెందిన బిజెపి మాజీ రాష్ట్ర నాయకులు ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి  హైదరాబాద్ గాంధీ భవన్ లో టీ,పీ,సీ,సీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారితో పాటు బిజెపి పార్టీకి చెందిన దాదాపు 500 మంది నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీలో చేరారు. ఈ సందర్బంగా టి,పి,సి,సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వినయ్ రెడ్డిని పార్టీలోకి స్వాగతిస్తూ ప్రసంగించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో బి,ఆర్,ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి దీటుగా పోరాడే నాయకుడు వినయ్ రెడ్డి నని అందుకే వినయ్ రెడ్డిని స్వయంగా తానే పార్టీలోకి ఆహ్వానించానని అన్నారు. అనంతరం వినయ్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి,బి,ఆర్,ఎస్ రెండు ఒకే పార్టీలని, సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాద్యమని అన్నారు. అందుకే బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు.వచ్చే ఎన్నికల్లో 30 వేల నుండి 40 వేల మెజారిటీ తో జీవన్ రెడ్డిని మట్టి కరిపించి టీ,పీ,సీ,సీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును బహుమతిగా ఇస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మాజీ శాసన సభ్యులు ఈరవత్రి అనిల్, టీ,పీ,సీ,సీ అధికార ప్రతినిధి వేణు గోపాల్ యాదవ్, జిల్లా నాయకులు ప్రాంతం నుండి వచ్చిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.