– 8-9 శాతం వృద్ధి కష్టమే డెలాయిట్ దక్షిణాసియా సీఈఓ అంచనా
న్యూఢిల్లీ : భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రతీ ఏడాది సగటున 8-9 శాతం వృద్ధి రేటును సాధించాల్సి ఉంటుందని డెలాయిట్ దక్షిణ ఆసియా సీఈఓ రోమల్ శెట్టి అన్నారు. ఇందుకోసం స్థిర వృద్ధి రేటు అవసరమన్నారు. రానున్న 20 ఏండ్ల పాటు ప్రతీ ఏడాది కూడా 8 నుంచి 9 శాతం వరకు జీడీపీ పెరుగుదల ఉంటేనే అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని పేర్కొన్నారు. 2047 కల్లా భారత్‌ను అభివృద్థి చెందిన దేశంగా మారుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే పేర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా.. ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత సులభమైన విషయం కాదని రోమల్ పేర్కొన్నారు. ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే ప్రతి సంవత్సరం 8-9 శాతం పెరుగుదలను నమోదు చేస్తున్నాయన్నారు. అంతరిక్ష రంగంలో భారత్‌లో ఇప్పటికే 200 స్టార్టప్ సంస్థలు ఉన్నాయని అన్నారు. 2040 కల్లా ఇవి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని అంచనా వేశారు. వ్యవసాయం, అంతరిక్షం, సెమీకండక్టర్, విద్యుత్ వాహనాల రంగంలో ఉన్న అవకాశాలను భారత్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశంలో ప్రతి సంవత్సరం కూడా 16 వేల నుంచి 18 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అభివద్ధి, వాణిజ్యానికి ఇది మరింత ఊతమిస్తుందని పేర్కొన్నారు.