లక్ష్మిపురం రోడ్డు సమస్య తీర్చండి

– బ్రిడ్జి నిర్మాణంలో ముందుచూపు కొరవడింది
– లక్ష్మిపురం, పెద్ద వెంకటాపురం గ్రామ ప్రజల ఆరోపణలు 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
ఆళ్ళపల్లి మండల నుంచి లక్ష్మిపురం గ్రామానికి వెళ్లే మార్గం మధ్యలో వేసిన బీటీ రోడ్డు నిర్మాణం ఇటీవల కాలంలో చేపట్టారు. అందులో భాగంగానే గత వేసవిలో రోడ్డు మధ్యలో నూతన కల్వర్టు నిర్మాణం చేపట్టడమూ జరిగింది. కానీ, కల్వర్టు నిర్మాణానికి ముందు దగ్గరలో కొంత బీటీ రోడ్డు నిర్మాణం తాత్కాలికంగా ఆపేయడంతో నిత్యావసరాలకు, వ్యవసాయ పనుల నిమిత్తం, తదితర వాటికై అటుగా రాకపోకలు సాగించే లక్ష్మిపురం, పెద్ద వెంకటాపురం, సింగారం, బూసరాయి, ఆళ్ళపల్లి గ్రామాల ప్రజలు ఆపసోపాలు, ఆటంకాలకు గురవుతున్నామని జనాలు వాపోతున్నారు. అలాగే పలువురు లక్ష్మిపురం, పెద్ద వెంకటాపురం గ్రామస్తులు అటుగా ఇటీవల నిర్మించిన బ్రిడ్జి నిర్మాణం గానీ, బీటీ రోడ్డు, కల్వర్టుల నిర్మాణంలో పాటించాల్సిన సరైన నాణ్యతా ప్రమాణాలు సంబంధిత గుత్తేదారులు పాటించలేదని ఆరోపిస్తున్నారు. దాంతో పాటు పెద్ద వెంకటాపురం సమీపంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంలో ముందు కరువైందని, దానివల్లే మా గ్రామస్తుడు వంతెన పనులు జరిగే క్రమంలో విద్యుత్ ఘాతుకానిక  గురై, చావుతప్పి కన్నులొట్ట బోయిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు విమర్శిస్తున్నారు. దాంతో భవిష్యత్తులో అటుగా వెళ్లే పత్తి, మొక్కజొన్న లోడ్లు, ఇతర పెద్ద వాహనాలకు ఎప్పటికైనా ప్రాణాపాయమేనని గ్రామస్తులు, రైతులు, వ్యాపారస్తులు చెప్తున్నారు. ప్రాణాపాయం చోటు చేసుకొనక ముందే సంబంధిత విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖాధికారులు రోడ్డు, వంతెన పరంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.