సకల జనం మాట.. బీఆర్ఎస్ బాట: ఎమ్మెల్యే

నవతెలంగాణ- ఆర్మూర్ 
  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సకల జనం బీఆర్ఎస్ బాట పట్టారని పీయూసీ చైర్మన్,  ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం  నియోజకవర్గంలో వివిధ పార్టీలు, ప్రజా, కుల సంఘాలకు చెందిన వేలాది మంది ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్ లో చేరుతున్నారు. తాజాగా మాక్లూర్ మండలం అమ్రాద్ గ్రామానికి చెందిన వీడీసీ ప్రతినిధులు, ముదిరాజ్ సంఘ సభ్యులు, డొంకేశ్వర్ మండలం గంగాసారం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, మాక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన పద్మశాలీ సంఘం సభ్యులు, చిన్నాపూర్ గ్రామ మైనారిటీ సోదరులతో పాటు పలు కుల సంఘాల సభ్యులు,ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన కుమ్మరి సంఘం సభ్యులు, ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లి ఎస్ ఎస్ కే సర్వసమాజ్ సభ్యులు  ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. అంకాపూర్ లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో శనివారం జరిగిన కార్యక్రమంలో వారికి  ఆయన  గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం ఇస్తామన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లో చేరిన వారు “దేశ్ కీ నేత కేసీఆర్, జై తెలంగాణ, జై జీవనన్న, అర్మూర్ అడ్డా కేసీఆర్ గడ్డ” అని చేసిన నినాదాలతో అంకాపూర్ ప్రాంతం దద్దరిల్లింది. గులాబీ తీర్ధం పుచ్చుకున్న  వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం లో అధ్బుతమైన ప్రగతి సాధించేలా గొప్పగా పాలిస్తున్న కేసీఆర్ ప్రభుత్వ ప్రగతిశీలక ఆలోచనా విధానం పట్ల తామంతా ఆకర్షితులమై  ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత  ఎమ్మెల్యే జీవనన్న నాయకత్వంలో పని చేయాలని  బీఆర్ ఎస్ లో చేరినట్టు తెలిపారు. వారినుద్దేశించి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం ఇస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమానికే ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు పట్టం కడుతున్నారని ఆయన తెలిపారు. “ఆర్మూర్ అంటేనే రైతులు, చేతి వృత్తులకు ప్రసిద్ధి. నియోజకవర్గం ప్రగతి బాటలో పరుగులు పెడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో అష్టకష్టాలు పడిన రైతులకు కేసీఆర్ గారి పాలన అన్నదాతలకు స్వర్ణ యుగం తెచ్చింది. రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా, చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ముఖ్యంగా పోచంపాడును నీటికుండల మార్చడం, గుత్ప ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడం, చెక్ డ్యామ్ లు నిర్మించడం వంటి కార్యక్రమాలతో రైతాంగం కుదుట పడేలా చేశాం. ఆర్మూర్ నియోజకవర్గం చేతి వృత్తులకు పెట్టింది పేరు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా కూలిపోయిన కుల వృత్తులకు మళ్లీ ప్రాణం పోసే కార్యాక్రమాలు అమలు జరుగుతున్నాయి. చేతివృత్తులకు ప్రభుత్వం బాసటగా నిలిచి జవసత్వాలు  ఇస్తోంది. చెరువుల్లో చేపల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టి మత్స్యకారుల జీబితాలకు వెలుగునిచ్చాం. రజక, నాయీ బ్రాహ్మణ వృత్తులకు ఉచితంగా విద్యుత్ సరఫరా జరుగుతోంది. బీసీ వర్గాలకు చెందిన కులవృత్తులకు ఒక లక్ష రూపాయల చొప్పున ఆర్థిక చేయూతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3వేల ఇండ్ల నిర్మాణానికి రూ.3లక్షల చొప్పున నిధులు ఇవ్వబోతున్నాం. ఇప్పటికే ఆర్మూర్ నియోజకవర్గంలో  లో 8వేల మంది యాదవ సోదరులకు గొర్రెల యూనిట్లు మంజూరయ్యాయి. ఎస్సీ సోదరులకు దళితబంధు ఒక వరం. కేసీఆర్ గారికి సకల కులాలు సమానమే. అందుకే అన్ని కులాలకు ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తాం. ఆర్మూర్ నియోజకవర్గానికి అద్భుత అభివృద్ధి, సంక్షేమ పథకాలు సాధించి ప్రగతి పథంలో నడిపిస్తున్న. రూ.20కోట్లతో సిద్ధులగుట్టకు ఘాట్ రోడ్డు, ఆర్మూరు అభివృద్ధికి అద్దం పట్టేలా తొమ్మిదికి పైగా బైపాస్ రోడ్ల నిర్మాణం, అర్బన్ పార్క్ నిర్మాణం వంటివి నేను సాధించిన విజయాలు.  కేసీఆర్  గారు కాకుండా ఎవరొచ్చినా తెలంగాణకు ముప్పే. ఎటు చూసినా కారు, సారు, కేసీఆరే. మళ్లీ మళ్లీ విజయం బీఆర్ ఎస్ దే.  కేసీఆర్ గారు హ్యాట్రిక్ సీఎంగా చరిత్ర సృష్టించడం ఖాయం. మళ్లీ నేనే గెలుస్తా. జీవితమంతా మీకు తోడుగా నిలుస్తా” అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.