
నవతెలంగాణ-పెద్దవంగర
మండలంలోని అవుతాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోటకూరి శ్రీనివాస్ మరోసారి ఔన్నత్యాన్ని చాటుకున్నారు. గ్రామంలోని విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం ఆదివారం శాశ్వత మండపం నిర్మాణానికి రూ. 40 వేలు విరాళం యూత్ నాయకులకు అందజేశారు. ఆయన గత కొన్నేళ్లుగా గ్రామ ప్రజలకు సేవాలు అందిస్తూ, ఆపదలో అండగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని అన్నారు. ఇతరుల కష్టాల్లో సాయం చేసినప్పుడే నిజమైన ఆత్మసంతృప్తి కలుగుతుందని చెప్పారు. తనకు తోచిన స్థాయిలో ఇతరులకు సహాయం చేస్తూ, గ్రామస్తుల కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తున్నానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తన తండ్రి స్వర్గీయ తోటకూరి మల్లయ్య జ్ఞాపకార్థం విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు గద్దల ప్రశాంత్, ఉపాధ్యక్షుడు చింతల మహేందర్, కోశాధికారి ఆలేటి మధు, ఆలేటి సంపత్, గద్దల అఖిల్, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బొమ్మెరబోయిన రవి, ప్రధాన కార్యదర్శి చాట్ల లక్ష్మినారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గద్దల స్వామి, సుధాకర్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కాసోజు సోమాచారి, యూత్ అధ్యక్షుడు ఆలేటి మధు, పాలబిందెల సంపత్ తదితరులు పాల్గొన్నారు.