మనసు ఖాళీగా లేదు

The mind is not emptyమనిషెంత ఖాళీగా ఉన్నా
మంచానికి పరిమితమైనా
కోర్కెల తాచులు కాటేస్తుంటే
ఆశలు రేసు గుర్రాలపై స్వారీ చేస్తుంటే
వయసు కిరీటం తొడుక్కున్నా
ఒంటరితనం చెట్టుకు వేలాడుతున్నా
సకల దాహాలు దండిగా తీరుతున్నా
సకల సౌకర్యాల ఉయ్యాలలో ఊగుతున్నా
మనసు ఖాళీగా ఉండదు
బురదలోంచి కారు వేగంగా నడిచినట్లు

బట్టలు తడిపే చెమట కారుస్తేనే
ఇంట్లో ముద్ద దిగేవారికి
చెమటను వడి పెట్టి పిండుకుంటూనే
చెమటను అసహ్యించుకునే వారికి
శరీరాన్ని బంగారు పళ్లెంలా పూజించుకుంటూ
ఏసీల గుడ్డులో దాక్కునే వారికి
శ్రమ అసౌందర్యం అనుకునే వారు
సాఫ్ట్‌వేర్‌ ట్యాగ్‌ మౌస్‌గా మారినవారు
రంగాలేవైనా రంగంలోకి
దిగినవారు, దిగనివారు
సమూహంలో బిజీబిజీగా ఉన్నా
ఆలోచనల ప్రవాహంలా మనసు

కొన్ని ఆలోచనలు మనసును పొక్కిలి చేస్తాయి
కొన్ని ఈదరగాలిలా వెంటాడుతాయి
భయం ముసురు కమ్ముకుంటాయి
ఉన్నచోట ఉండనీయవు,
నిద్రపట్టనీయని దుస్థితి
ఆవేశం, ఆగ్రహం పొయ్యి మండిస్తాయి
అన్నింటి నుంచి మనసు
ఖాళీ అయితేనే ప్రశాంతత

మనసు ఖాళీ చేసేందుకు
ఆశ్రయించాలి మౌనాన్ని
నిలకడ నీటిలో చినుకు పడకుండా చూడాలి
రాళ్లు కాదు, రూపాయలు పడ్డా సమస్యే
యోగ, ధ్యానం తోవలో పడితే
ఏకాగ్రత నిలువెల్లా నిలిస్తే
మనసు ఖాళీ, మనిషి తేజవంతం
– కొమురవెల్లి అంజయ్య
9848005676