ఇండియా పేరును భారత్‌గా మార్చడం

Changing the name of India to Bharat– ఇష్టం లేకపోతే దేశం విడిచి వెళ్లిపోండి
– బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు
– కోల్‌కతాలో విదేశీయుల విగ్రహాలు తొలగిస్తాం
కోల్‌కతా: ‘ఇండియా’ పేరును ‘భారత్‌’గా మార్చడం ఇష్టంలేని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవచ్చని బీజేపీ ఎంపీ దిలీప్‌ ఘోష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కోల్‌కతాలో విదేశీయుల విగహ్రాలను తొలగిస్తామని చెప్పారు. ఆదివారం ఖరగపూర్‌లో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ‘ఛారు పే చర్చా’ కార్యక్రమంలో బిజెపి సీనియర్‌ నాయుకులు, మేదినిపూర్‌ ఎంపీ దిలీప్‌ ఘోష్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కోల్‌కతాలో వలసవాదానికి ప్రతీకగా నిలిచిన విదేశీ విగ్రహాలన్నింటినీ తొలగిస్తాం. ఇండియా పేరును భారత్‌గా మార్చడం నచ్చని వాళ్లు దేశం వదిలి వెళ్లిపోవచ్చు’ అని అన్నారు. మరో బీజేపీ నాయకుడు రాహుల్‌ సిన్హా మాట్లాడుతూ.. ‘దేశానికి రెండు పేర్లు ఉండవు. ఢిల్లీ వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సు జరుగుతోంది. పేరు మార్చడానికి ఇదే సరైన సమయం’ అని వ్యాఖ్యానించారు. జీ20 దేశాధినేతలను విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ పేరుతో ఆహ్వానాలు పంపడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశం పేరును ‘ఇండియా’గా కాకుండా భారత్‌గా పేర్కొనడం దారుణమని మండిపడుతున్నాయి.