శాంతి కోసం ఐక్యంగా పని చేయండి లేదా రాజీనామా చేయండి

Work together for peace
Or resign– కుకీ-జో ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అల్లుడి హుకుం
ఇంఫాల్‌ : మణిపూర్‌లో శాంతి కోసం ఐక్యంగా పని చేయాలని పది మంది కుకీ-జో ఎమ్మెల్యేలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ అల్లుడు, అధికార బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ ఇమో సింగ్‌ కోరారు. రాష్ట్రం నుంచి విడిపోవాలనే తమ డిమాండ్‌ను ముందుకు తీసుకురావాలంటే మాత్రం వారు తమ పదవులకు రాజీనామా చేయాలని పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న రాజ్‌కుమార్‌ ఇమో సింగ్‌.. 2021లో బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన పోస్టు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, రాష్ట్రంలోని 10 మంది కుకీ-జో ఎమ్మెల్యేలలో ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలే కావటం గమనార్హం. వారిలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. రాష్ట్రంలో జాతుల మధ్య హింస చెలరేగిన అనంతరం ఈ 10 మంది కుకీ-జో ఎమ్మెల్యేలు ఇంఫాల్‌కు దూరంగా ఉన్నారు. రాష్ట్రంలో మే 3న చెలరేగిన హింస ఇప్పటికీ కొనసాగుతున్నది. దాదాపు నాలుగు నెలలకు పైగా రాష్ట్రంలో అశాంతి కొనసాగుతున్నది. ఇప్పటి వరకు కనీసం 179 మంది మరణించారు. 67 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.