– బీఆర్‌ఎస్ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
నవతెలంగాణ-హైదరబాద్‌బ్యూరో
ఈనెల 17వ తేదీ జరిగే జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం భారత సమాఖ్యలో విలీనమైన 17వ తేదీని జాతీయ సమైక్యత దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్‌లో జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పాల్గొంటారని తెలిపారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో జాతీయ పతాకాలు ఎగురేయాలని చెప్పారు. వేడుకల్లో ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ, గడిచిన పదేండ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని వారికి వివరించాలన్నారు. కొన్ని పార్టీలు దీన్ని కూడా రాజకీయాలు చేస్తూ కుట్రలు చేస్తున్నాయనీ, మతాన్ని జోడించి సమాజంలో చిచ్చుపెట్టే విచ్ఛిన్నకర శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.