సోయా రైతులకు నష్టపరిహారం ఇప్పించాలి

– నకిలీ బిల్లులతో రైతులను మోసం చేసిన వ్యాపారి పై చర్యలు తీసుకోవాలి
– అధికారులకు వినతిపత్రం ఇచ్చిన హాస కొత్తూర్ రైతులు 
 నవతెలంగాణ-కమ్మర్ పల్లి
నకిలీ విత్తనాలతో మోసపోయిన సోయా రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని, నకిలీ బిల్లులతో రైతులను మోసం చేసిన వ్యాపారి పై చర్యలు తీసుకోవాలని మండలంలోని హాస కొత్తూర్ రైతులు కోరారు. ఈ మేరకు సోమవారం గ్రామానికి చెందిన 86 మంది రైతులు మండల కేంద్రంలోని రైతు వేదిక వద్దకు తరలివచ్చి వ్యవసాయ విస్తీర్ణాధికారి రవికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ…. గ్రామానికి చెందిన వ్యాపారి పుట్కామ్ గంగాధర్ వద్ద 86 మంది రైతులు 26 కిలోల బరువున్న 242 సోయా విత్తన  సంచులను కొనుగోలు చేశారు. వ్యాపారి గంగాధర్  ఒక్కో సోయా విత్తన బస్తాను  రూ.3వేల 5వందల నుండి రూ.3వేల 7వందల వరకు రైతులకు విక్రయించాడు. రైతులకు సోయా విత్తనాలు కేడిఎస్ కంపెనీ అని చెప్పి, ప్యాక్ చేసి వేరే విత్తనాలు అంటగట్టాడు. వాటిని తీసుకెళ్లి విత్తిన రైతులు సోయా పూత, కాత రాకపోవడంతో రైతులు వ్యాపారి గంగాధర్ ను నిలదీసి ప్రశ్నించారు. వ్యాపారి రైతులకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.  పైగా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని రైతులకు చెప్పి వెళ్ళిపోయాడు.సోయా బస్తాలకు సంబంధించి బిల్లులు అడిగితే మహారాష్ట్ర కంపెనీకి చెందిన బిల్లులు ఇచ్చాడు. మీకు లైసెన్స్ ఉందా అని అడిగితే ఎటువంటి సమాధానం చెప్పలేదని రైతులు తెలిపారు. రైతులకు ఒక్కో బస్తాకు 15 క్వింటాళ్ల చొప్పున పంట వస్తుందని చెప్పి రైతులను మోసం చేశాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పూత లేక.. కాత లేక దిగుబడి రాక సోయా పంట మొత్తం నష్టం జరిగిందని రైతులు వాపోయారు. నష్టపోయిన రైతులందరికీ నష్టపోయిన కింద  ఒక్కో విత్తన బస్తాకు 12 క్వింటాళ్ల నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతూ రైతులు ఏఈఓ ద్వారా  భీమ్గల్ ఏడిఏ కు  వినతిపత్రం అందజేశారు.