సాత్విక్‌ జోడీకి టైటిల్‌

– స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
బసెల్‌ : భారత బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి డబుల్స్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకీరెడ్డి, చిరాగ్‌ శెట్టి స్విస్‌ ఓపెన్‌ మెన్స్‌ డబుల్స్‌ చాంపియన్లుగా నిలిచారు. బసెల్‌లో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ భారత జోడీ ఘన విజయం సాధించింది. స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 టైటిల్‌ను సొంతం చేసుకుంది. టైటిల్‌ పోరులో చైనా జంటను సాత్విక్‌, చిరాగ్‌ జోడీ వరుస గేముల్లో ఓడించారు. 21-19, 24-22తో 54 నిమిషాల థ్రిల్లర్‌లో డ్రాగన్‌ ద్వయానికి చెక్‌ పెట్టి టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నారు. తొలి గేమ్‌లో 11-8తో విరామ సమయానికి ముందంజ వేసిన మనోళ్లు.. ద్వితీయార్థంలోనూ దూకుడు తగ్గలేదు. 17-12తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి తొలి గేమ్‌ను గెల్చుకున్నారు. సాత్విక్‌, చిరాగ్‌ ఇద్దరూ ఆకట్టుకున్నారు. రెండో గేమ్‌ ఉత్కంఠగా సాగింది. 8-8, 11-11తో థ్రిల్లర్‌ను తలపించింది. 20-18తో ముందున్న సాత్విక్‌, చిరాగ్‌లు చైనా జోడీకి మూడు మ్యాచ్‌ పాయింట్లు కాచుకునే అవకాశం కల్పించారు. టైబ్రేకర్‌కు దారితీసిన గేమ్‌లో సాత్విక్‌, చిరాగ్‌ చివర్లో పుంజుకున్నారు. 24-22తో రెండో సెట్‌, స్విస్‌ ఓపెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో మలేషియా ఓపెన్‌ సెమీస్‌కు చేరుకున్న భారత జోడీ.. ఇటీవల ఆల్‌ ఇంగ్లాండ్‌ చాంపియన్‌షిప్స్‌లో రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. ఈ ఏడాది సాత్విక్‌, చిరాగ్‌ జోడీకి ఇదే తొలి టైటిల్‌.