ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలి

Asha workers should be paid a minimum wage of Rs.18 thousand– 32 రకాల రిజిస్టర్‌లను ప్రభుత్వమే సరఫరా చేయాలి
– సమస్యల పరిష్కారం కోసం ”ఛలో హైదరాబాద్‌” కు తరలిన ఆశ వర్కర్లు
నవతెలంగాణ-దుబ్బాక
ఏళ్ల తరబడి ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేయకుండా మోసం చేస్తున్నాయని సిఐటియు జిల్లా కోశాధికారి జి.భాస్కర్‌ విమర్శించారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా ఆశ వర్కర్లకు కనీస వేతనంగా రూ.18 వేలు అమలు చేయాలని, 32 రకాల రిజిస్టర్‌లను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ”హైదరాబాద్‌ లోని హెల్త్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నా”కు దుబ్బాక నుంచి ఆశ వర్కర్లు తరలివెళ్లారు. వీరికి సిఐటియు జిల్లా కోశాధికారి జి.భాస్కర్‌ మద్దతు తెలిపి మాట్లాడారు. 2021 కి సంబంధించిన ఆరు నెలల పిఆర్సి వేతనాలను ఆశాలకు వెంటనే చెల్లించాలన్నారు. టీబి, లెప్రసీ, కంటి వెలుగు, తదితర పెండింగ్‌ బిల్లులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆశ వర్కర్లకు సంబంధం లేకుండా అదనపు పనులను అప్పగించడం ఉపసంహరించుకోవాలని, అలాగే వారికి ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ టౌన్‌ కన్వీనర్‌ కొంపల్లి భాస్కర్‌, ఆశా వర్కర్ల యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు మంజుల, భాగ్యలక్ష్మి, భారతి, శ్యామల, శోభ, చంద్రకళ, సంతోష, అనిత, లత, వసుంధర పలువురున్నారు.