– 62 మంది కార్మికులకు సంవత్సరమంతా పని కల్పించాలి
– సీపీఎం పార్టీ కార్మికుల సమ్మెకు సంఘీభావం
నవ తెలంగాణ-కొమురవెల్లి
కొమురవెల్లి దేవస్థాన సఫాయి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంవత్సరం పొడవునా 62 మందికి పని కల్పించాలని రాజగోపురం ముందు సోమవారం కార్మికులు ఆందోళన చేపట్టారు. సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ 62 మంది కార్మికులకు సంవత్సరం పొడవునా పని కల్పించాలని డిమాండ్ చేశారు.
సీపీఐ(ఎం) పార్టీ సంఘీభావం
రాజగోపురం ముందు సఫాయి కార్మికులు చేపట్టిన ధర్నాకు సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి మాట్లాడుతూ కోట్ల రూపాయల ఆదాయం ఉన్న మల్లన్న ఆలయానికి 62 మంది సఫాయి కార్మికులు చేస్తున్న కష్టానికి జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవా అని ప్రశ్నించారు. 62 మంది కార్మికులకు 31 మందిని పనిలోకి తీసుకొని మరొక 31 మందికి పని కల్పించక పోవడం సరికాదన్నారు. పరిసరాలను శుభ్రపరిచే కార్మికుల పొట్ట కొట్టొద్దని అన్నారు.
ఎమ్మెల్యే హామీతో ధర్నా విరమించిన కార్మికులు
కార్మికుల ధర్నా విషయాన్ని ఆలయ ఈఓ పాలకమండలి ఎమ్మెల్యే దష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆలయానికి చేరుకొని సపాయి కార్మికుల సమస్యను ఎండోమెంట్ కమిషనర్ ఆమోదంతో పది రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సఫాయి కార్మికులతో ధర్నా విరమింప చేశారు సంఘీభావం తెలిపిన వారిలో రాంసాగర్ సర్పంచ్ తాడూరి రవీందర్, నాయకులు తాడూరి మల్లేశం, మేకల కపాకర్, సీఐటీయూ మండల నాయకులు ఆరుట్ల రవీందర్, కరోళ్ళ ఎల్లయ్య, తదితరులు సంఘీభావం తెలిపారు.