‘పాలమూరు-రంగారెడ్డి’ సాగునీటి ఎత్తిపోతల పథకం నేడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రాజెక్టు పూర్తికాకుండానే ప్రారంభోత్సవానికి బీఆర్‌ఎస్ సర్కారు తొందరపాటే కారణం. దీనికి సర్కారు వైఖరిని సాగునీటి రంగ నిపుణులు, రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి. సాధారణ ఎన్నికలు అక్టోబరు తర్వాత ఎప్పుడైనా రావచ్చనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కారు అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరిగెత్తించేందుకు పావులు కదుపుతున్నది. 30 నెలల్లో పూర్తిచేస్తామన్న ప్రాజెక్టు కాస్త, 90నెలలకు చేరడంపై ఒకవైపు అసంతృప్తి వ్యక్తమవుతుంటే, మరోవైపు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నచందాన ‘గులాబీ’ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. 60రోజులపాటు రెండు టీఎంసీల శ్రీశైలం నీళ్లను ఎత్తిపోయడమే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఉద్దేశం. దేశచరిత్రలో నిర్వాసితులకు కనివినీ ఎరుగని పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ మాట నీటిమూటే అయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తల నరుక్కుంటానన్న సీఎం, ఇప్పుడు ప్రతిపక్షాల మాటలను బేఖాతరు చేస్తూ ఈనెల 16న వెట్‌రన్‌కు గ్రీన్‌సిగల్ ఇచ్చేశారు. దీన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రాజెక్టు పనులు 30శాతం కూడా పూర్తికాలేదనేది నగసత్యం. మొత్తం ప్రాజెక్టులో 31పంపులకుగాను కేవలం ఒక పుంపునకు మాత్రమే వెట్‌రన్ చేపడుతుండటమే అసంపూర్తి ప్రాజెక్టు అని చెప్పడానికి సాక్ష్యం. కొద్దిపాటి పనులు చేసి, సర్కారు మసిపూసి మారేడుకాయ చేస్తున్నదంటూ ప్రతిపక్షాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రాజెక్టు పనుల నాణ్యత కూడా ప్రశ్నార్థకమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
వట్టెం జలాశయం కోతకు గురైతే, 50కిపైగా గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ప్రాజెక్టుకు గంటకొట్టే పేర సర్కారు నిధులతో ఎన్నికల ప్రచారానికి ఒడిగట్టడం సహించరానిది. రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పి, దక్షిణ తెలంగాణను ఏడారిగా మారుస్తారా? అంటూ సీఎంపై ముప్పేటా దాడికి దిగే పరిస్థితి. శాస్త్రీయంగా డ్రైరన్ చేపట్టిన నెలరోజుల తర్వాత వెట్‌రన్‌ను చేపట్టాలి. ఆగమేఘాల మీద 13రోజులకే వెట్‌రన్‌కు శ్రీకారం చుట్టడం వెనుక వచ్చే ఎన్నికలు పరమార్థం కాదా? రేపు ఏదన్నా జరగరానిది జరిగితే బాధ్యులెవరు? కాళేశ్వరంపై చూపిన శ్రద్ధ పాలుమూరు-రంగారెడ్దిపై లేదనే విషయమై రచ్చ ఇప్పటికే జరు గుతూ ఉన్నది. సాధారణ నిర్మాణం, ప్రధాన కాలువలతోపాటు పంట కాలువలనూ కట్టాలి. నార్లపూర్, ఎదుల, ఉద్ధండాపూర్, కరివెన నాలుగు ప్రాజెక్టుల్లో నీళ్లు నింపడం ద్వారా సాగునీరు ఇచ్చినట్టుగా భావిస్తున్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా-1, బీమా-2, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను 2004లో చేపట్టి, 80 శాతమే పూర్తి చేశారు. బీఆర్‌ఎస్ సర్కారూ పాత ప్రభుత్వాల మాదిరిగానే ప్రధాన కాలువలు, ఫీల్డ్ ఛానళ్లను నిర్లక్ష్యం చేసింది. 2004లో ప్రాజెక్టులను చేపట్టినా 80 శాతమే పూర్తయ్యాయి. ఇంకా 30శాతం పెండింగే. కల్వకుర్తి ఎనిమిది పంపులకుగాను మూడే నడుస్తున్నాయి. ఐదారేండ్లుగా ఐదు పంపులను రికవరీ చేయనేలేదు. శ్రీశైలం నుంచి నీళ్లు రాలేదు. అవివస్తేనే పాలమూరు-రంగారెడ్డికి సార్థకత. వర్షాభావ పరిస్థితి కొనసాగితే ఈనాలుగు ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని కూడా నింపలేరు. ఒక్క పంపుతో నార్లపూర్ ప్రాజెక్టును ఎలా నింపుతారు? నిజాలను చెప్పకుండా ఇంకెంత కాలం ప్రజలను మభ్యపెడతారు? 2004లో చేపట్టిన ప్రాజెక్టులే పూర్తిచేయలేదు. అయితే ఇప్పుడు వర్షాలు లేకపోవడంతో వానాకాలం సీజన్ ఈ సెప్టెంబరుతో ముగుస్తున్నది. అక్టోబరు, నవంబరు రెండో పంటనే. దీంతో మొదటి పంట పోయినట్టే. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న విపరీత జాప్యంతో రూ.35,200 కోట్ల బడ్జెట్ కాస్త మూడు రెట్లు పెరిగి రూ.75 వేల కోట్లకు చేరిందని ఇరిగేషన్ శాఖ చెబుతున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 33లక్షల ఎకరాలకుగాను 10లక్షల ఎకరాలకు కూడా సాగునీటిని అందించలేకపోయారు. ఆశ్చర్యం ఏమిటంటే, నెదర్లాండ్ దేశం తొమ్మిది లిఫ్ట్ పథకాలు మంజూరు చేస్తే, వాటినీ మూలనపడేశారు. కోయిల్‌సాగర్ 32 వేల ఎకరాల ఆయకట్టును మరో 50వేల ఎకరాలకు పెంచే ప్రయత్నం చేసినా, పదెకరాలు కూడా పెరగకపోవడం సిగ్గుచేటు. తెలంగాణ ట్యాగ్‌లైన్ ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అంటూ ఎంత గొప్పగా నినాదం ఇచ్చారో, తొమ్మిదేండ్లయినా సర్కారీ ఆచరణ ఆస్థాయికి చేరకపోవడం గమనార్హం. ఈ తరుణంలో వెట్‌రన్‌ను నిర్వహించడంలో మర్మమేమిటో ప్రజలు అర్థం చేసుకోవాలి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా ఉంది.