– ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
– యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బొడ్డు రాజలక్ష్మి
– 2వ రోజు కొనసాగిన సమ్మె
– బతుకమ్మ ఆడి నిరసన
నవతెలంగాణ-యాచారం
రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బొడ్డు రాజలక్ష్మి డిమాండ్ చేశారు. సీఐటీయూ, ఏఐటీయూసీ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్స్, తహసీల్దార్ కార్యాలయం ఎదుట రెండోవ రోజు కొనసాగుతున్న సమ్మెలో వారు పాల్గొన్నారు. అనంతరం అంగన్‌వాడీలు బతుకమ్మ ఆడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ ఉద్యోగులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. గ్రాడ్యూటీ అమలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పెంపు, మొదలగు పలు సమస్యలు పరిష్కరించాలని కోరారు. పది రోజుల్లో వేతనం పెంచుతామని మంత్రి కూడా ప్రకటన చేశారని గుర్తు చేశారు. టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్‌కు రూ.లక్షా చొప్పున ఆసరా కింద అందిస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ఈఎస్‌ఐ, పీఎఫ్ కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వారికి గ్రాట్యూటి చెల్లించి, ఉద్యోగ విరామం తరువాత రూ.10 లక్షలు, హెల్పర్స్‌కు రూ.5 లక్షలు ఇవ్వాలని ఆమె తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనియేడలా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ చందునాయక్, అంగన్‌వాడీ టీచర్లు యాదమ్మ, అండాలు, హేమలత, విజయలక్ష్మి, పద్మ, విమల, రమణ, సుజాత, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.