అంగన్‌వాడీలను బెదిరించడం దుర్మార్గం

– సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
– సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్‌
నవతెలంగాణ-చేవెళ్ల
సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లను బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గమైన చర్య అని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్‌, అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా కోశాధికారి లక్ష్మి అన్నారు. మంగళవారం చేవెళ్ల నియోజకవర్గం కేంద్రం చేవెళ్ల మండల కేంద్రంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ ఉద్యోగుల సమ్మె రెండోవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్‌వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారనీ, వీరంతా మహిళలు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారని అన్నారు. వీరంతా 48 ఏండ్లుగా ఐసీడీఎస్‌లో పని చేస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. వీరికి కనీస వేతనం, పెన్షన్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలు ఏమి ప్రభుత్వం నేటికీ కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల అంగన్‌వాడీ ఉద్యోగులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించినట్టు చెప్పారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం కూడా అంగన్‌వాడీ ఉద్యోగులను పర్మనెంట్‌ చేసి, వారి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని సెక్టార్ల అధ్యక్షురాలు స్వప్న, ప్రవీణ, చంద్రకళ, పద్మారాణి, గిరిజ, సౌభాగ్య, భాగ్యమ్మ, కల్పన, ప్రేమలత, పద్మావతి, అంగన్‌వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.