అ..ఆ

A..A”ఏదేమైనా పెద్దాయన స్పీచ్‌ అదరహో!” అన్నాడు సురేష్‌.
”ఏ విషయంలో పెద్దాయన స్పీచ్‌ అదరగొట్టాడో కాస్త చెప్పు?” అన్నాడు రాజు.
”ఏ విషయంలోనైనా ఎప్పుడైనా సరే! మా పెద్దాయన స్పీచ్‌ అదరగొడతాడు! ఎనీ టైమ్‌, ఎనీ ప్లేస్‌, ఎనీ సబ్జెక్ట్‌!” అన్నాడు సురేష్‌.
”తాజాగా అదరగొట్టిన స్వీచ్‌ ఏమిటో చెప్పమంటున్నా!” అన్నాడు రాజు.
”నీవు విన్లేదా! మన తెలంగాణా లోనే, కాంగ్రెస్‌ బండారం బయట పెట్టాడు! పెద్దా యనా మజాకా?” అన్నాడు సురేష్‌ గర్వంగా.
”నాన్చొద్దు! విషయం ఏమిటో చెప్పు!” అన్నాడు విసుగ్గా రాజు.
”గత ఐదేండ్లుగా అంబానీ, ఆదానీలను కాంగ్రెస్‌, రాహుల్‌ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన విషయం, ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించ గానే గప్‌చుప్‌ అయిపోయిన సంగతి పెద్దాయన బయటపెట్టారు! అంతేకాదు నల్లధనం, నోట్ల కట్టలు టెంపోల్లో పంపించి, రాహుల్‌కి ముట్ట చెప్పిన రహస్యాన్ని కూడా దేశ ప్రజలకు తెలియచేశారు! టెంపోల్లో వచ్చిన నల్లధనం ముట్టగానే రాహుల్‌ నోరుమూసుకున్నారని భారతదేశానికి, ప్రపంచానికి తెలిసిపోయింది! వాV్‌ా మోడీజీ! మీ లాంటి ప్రధాని ఉన్నందుకు, మా జన్మ ధన్యమై పోయింది!” అంటూ చేతులు జోడించాడు సురేష్‌.
చిన్నగా నవ్వాడు రాజు.
”ఎందుకు నవ్వుతావు? యువరాజు ఎలాంటి వాడో తెలిసింది కద! యువరాజు నిజస్వరూపాన్ని బయట పెట్టినందుకైనా పెద్దాయన్ను మరోసారి ప్రధానిని చేయాల్సిందే!” అన్నాడు సురేష్‌ దృఢంగా.
”అంబానీ, ఆదానీలు నిజంగానే టెంపోల్లో! రాహుల్‌కు డబ్బు పంపారంటావా?” అనుమానంగా అడిగాడు రాజు.
”ముమ్మాటికీ నిజం! మా పెద్దాయన ఏ ఆధారం లేకుండా ఏదీ మాట్లాడడు! ఏ సాక్ష్యమూ లేకుండా అసలే ఉపన్యాసం చెప్పడు! అంతెందుకు సత్య హరిశ్చంద్రుడు, రామ్‌లల్లా కూడా పెద్దాయనను ఆదర్శంగా తీసుకుని, సత్యవాక్పరిపాలనా వ్రతం చేపట్టారు తెలుసా?” అన్నాడు సురేష్‌.
”ఆగాగు! మరీ అంతవెనక్కి వెళ్ళకు! ముందు నా డౌటు తీర్చు! టెంపోల్లో నోట్ల కట్టలు రాహుల్‌కి ముట్టిన విషయం నిజమైతే వెంటనే ఈడిని పంపొచ్చు కదా! రాహుల్‌ రెడ్‌ హ్యండెడ్‌గా పట్టు పడేవాడు! అన్నాడు రాజు.
”ఈడిపై పెద్దాయన ఏ ఒత్తిడీ చేయరు! ఈడి స్వతంత్రంగా పని చేయాలనీ ఈడికి రోజూ ఫోన్‌ చెబుతుంటారు! కాని ఈడి ఇప్పుడు క్రేజీవాల్‌, హేమంత్‌ సోరేన్‌ కేసుల్లో బిజీగా ఉంది కదా!” అన్నాడు సురేష్‌.
‘కేజ్రీవాల్‌, హేమంత్‌ల వద్ద ఇంత వరకేమైనా నోట్ల కట్టలను ఈడి కనుగొన్నదా? రైడింగ్‌లో దొరికిన డబ్బును కోర్టులో ప్రవేశ పెట్టిందా?’ అడిగాడు రాజు.
”వాళ్లు ఆరితేరిన దొంగలు! అందుకే డబ్బు దొరక్కుండా జాగ్రత్తపడ్డారు!” అన్నాడు సురేష్‌.
”వారు డబ్బు దొరక్కుండా జాగ్రత్త పడ్డారు సరే! ఎప్పుడో కనుమరుగైపోయిన టెంపోలో నోట్ల కట్టలు తరలిస్తుంటే తెలుసుకున్న మనిషి ఎవరో కాదు! స్వయాన దేశ ప్రధాని ఈడి, సిబిఐ, మీడియా, ఆఖరికి ఎన్నికల కమిషన్‌ ఎవరో ఒకరికి ఫిర్యాదు చేయవచ్చు కదా! తాను ఫొటోలు తీస్తూ, తననే ఫొటోలు తీయించుకున్న పెద్దాయన. టెంపోను ఎందుకు వీడియో తీయించలేకపోయారు? ఆ పని చేసి ఉంటే కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ స్వప్నం సాకారమయ్యేది కదా!” అన్నాడు రాజు.
”మీరింతే! మీరు దేశాన్ని వికసిత్‌ భారత్‌ కానివ్వరు! మీవల్లే దేశం అల్లకల్లోలం అవుతు న్నది! దేశద్రోహులు మీరు!” అన్నాడు సురేష్‌.
”దేశ ద్రోహం అంటే ఏమిటో తర్వాత మాట్లాడుకుందాం! కాని నాకు మరో డౌటు వచ్చింది! దాన్ని తీర్చు! అంబానీ, ఆదానీల వద్ద నల్లధనం ఉన్నదా?” అడిగాడు రాజు.
”వారి వద్ద నల్లధనం లేకపోతే పెద్దాయన నోటి ద్వారా ఆ మాటలు రావు! మాట వచ్చిందంటే అది గ్యారెంటీ!” అన్నాడు సురేష్‌.
”అది గ్యారెంటీ అయితే! అంతకుముందు చెప్పిన మాటలకు గ్యారెంటీ ఉన్నట్లా? లేనట్లా?” అడిగాడు రాజు.
”పెద్దాయన మాటంటేనే గ్యారంటీ! అసలు గ్యారెంటీ, మోడీ వేర్వేరు కాదు!” అన్నాడు సురేష్‌.
”మరి పదేండ్ల ముందు దేశ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి, మనందరి అకౌంట్లలో రూ.15లక్షలు వేస్తానని గ్యారంటీ ఇచ్చాడు పెద్దాయన. విదేశాల సంగతి దేవుడెరుగు! స్వదేశంలోని అంబానీ, ఆదానీల వద్దనున్న నల్లధనాన్ని పంచిపెడితే రాత్రింబవళ్లు కష్టపడుతున్న మీ పార్టీ కార్యకర్తలకైనా, కనీసం ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలైనా వచ్చేవి కదా!” అన్నాడు రాజు.
ఒక్కసారిగా షాక్‌ తిన్నాడు సురేష్‌! ”నిజమే పెద్దాయనను సమర్థించే హడావుడిలో తాను ఈ లెక్కలు వేసుకోలేదు!” అంబానీ, ఆదానీల వద్ద నిజంగానే నల్లధనం ఉంటే పెద్దాయన ఎందుకు ఆ నల్లధనాన్ని స్వాధీనం చేసుకుని తనలాంటి కార్యకర్తలకైనా పంచి పెట్టొచ్చు కదా! ఆ పప్పులో కాదు! ఈ పప్పులోనే ఏదో ఉంది!” అని ఆలోచిస్తున్నాడు.
”నీవు ఆలోచిస్తున్నది నిజమే! అంబానీ, ఆదానీల వద్దకి గత పదేండ్లలో లక్షల కోట్ల రూ|| డబ్బు వచ్చి చేరింది. ఇదంతా అక్రమార్జన నీవు, నేను, మనందరి లాంటి సగటు మధ్య ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకుని కూడ బెట్టిన సొమ్మును, జీఎస్టీ, ఆదాయపు పన్ను , టోల్‌టాక్స్‌ మొ|| పన్నుల పేరిట తోలు వలచి మరీ వసూలు చేస్తున్నాడు పెద్దాయన!”అన్నాడు రాజు.
”ఆ పన్నులకు అంబానీ, ఆదానీలకు ఏం సంబంధం?” అమాయకంగా అడిగాడు సురేష్‌.
”అది బీరకాయ పీచు బంధుత్వం! మన వద్ద వసూలు చేసిన పన్నులు ప్రభుత్వానికి చేరుతున్నాయి! అంబానీ, ఆదానీలు ప్రభుత్వ బ్యాంకుల వద్ద లక్షల కోట్లు అప్పులు చేసి, వాటిని తిరిగి చెల్లించడం లేదు! ప్రభుత్వంలో ఉన్న పెద్దాయన, ఆ బాకీలు మొండిబాకీలని రద్దు చేస్తున్నాడు! అట్లా రద్దు చేసిన బాకీల విలువ రూ.16 లక్షల కోట్లు. అంటే మన తెలంగాణా అయిదేండ్ల పాటు ఒక్క రూపాయి సంపాదించకుండానే, అన్ని పథకాలు అమలు చేయవచ్చు!” వివరించాడు రాజు.
గందరగోళంగా చూశాడు సురేష్‌.
”ఇందులో గందరగోళమేమీ లేదు! ప్రజల డబ్బు ఎంత పెద్ద మొత్తంలో కార్పోరేట్లకు చేరుతుందో చెప్పటానికి ఒక ఉదాహరణ అది! వారి వద్ద ఉన్న నల్లధనాన్ని పెద్దాయన బయటపెట్టక పోగా, మరింత నల్లధనాన్ని వారి వద్దకు స్వయంగా జమ చేసిన నిష్టూర సత్యాన్ని మనం అర్థం చేసుకోక పోతే, కనబడని టెంపోలే నిజమనుకుంటాం!” వివరించాడు రాజు.
”ఏనాడు అంబానీ, ఆదానీ గురించి వ్యతిరేకంగా పెద్దాయన మాట్లాడలేదు! పైగా వారే సంపద సృష్టికర్తలని అనేకసార్లు చెప్పాడు! ఇప్పుడెందుకిలా మాట్లాడాడు?” అడిగాడు సురేష్‌.
”నీవు చెప్పింది నిజమే! సహజ వనరులైన స్పెక్ట్రం, బొగ్గు, యురేనియం, లిగ్నైట్‌ గనులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రోడ్లు బస్సులు, రైల్వేలు, రక్షణ ఉత్పత్తులు ఒకటేమిటి, సర్వం వారికే పెద్దాయన ధార పోశాడు. ఇంకా పోస్తున్నాడు కూడా! హిడెన్‌ బర్గ్‌ రిపోర్టులో కూడా ఆదానీ అవకతవకలకు పాల్పడ్డాడని వస్తే, ఆదానీ తప్పేమీ లేదని వాదించాడు! అంబానీ ఇంట్లో నిశ్చితార్థం జరిగినపుడు రామ్‌లల్లా పూజలో గడిపిన సమయం కంటే ఎక్కువసేపు, నిశ్చితార్థం దగ్గర ఒక ప్రధాని స్థాయిలో గడిపాడు! ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో స్వయంగా ఆదానీ విమానంలోనే ఎన్నికల ప్రచారం చేశాడు! ఇప్పుడు అకస్మాత్తుగా ప్లేటు మార్చాడు! ఎందుకంటే ఈ ఎన్నికల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలైన, నిరుద్యోగం, ఆకలి, పేదరికం, ధరల పెరుగుదల మొ|| ముందుకు వచ్చాయి.ప్రజల సొమ్మును అంబానీ, ఆదానీలకు దోచిపెట్టడమే కారణమని ప్రజలు గుర్తిస్తున్నారేమోనన్న భయం పెద్దాయనకు పట్టుకుంది! అందుకే ఆ పాపాన్ని కాంగ్రెస్‌ ఖాతాలో వేసేందుకే ఇలా మాట్లాడుతున్నాడు!” వివరించాడు.
”అంబానీ, ఆదానీలు మాత్రమే దగ్గరగా ఉంటారని అనుకున్నాను గాని అ,ఆ లమధ్య నమో ఉంటారని అర్థం చేసుకోలేక పోయాను!” అని చెంపలేసుకున్నాడు సురేష్‌.
– ఉషాకిరణ్‌