నవతెలంగాణ-మెహిదీపట్నం
హైదరాబాద్‌లో కుక్కల దాడిలో మరో బాలుడు మృతిచెందాడు. ఈ నెల 8న శునకాల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 5 నెలల బాలుడు సోమవారం చనిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
అంజి- అనుష దంపతులు షేక్‌పేట వినోబానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈనెల 8న వారి ఐదు నెలల బాలుడిని గుడిసెలో ఉంచి కూలి పనికి వెళ్లారు. గుడిసె వద్దకు వచ్చిన వీధి కుక్కలు ఆ చిన్నారిని గాయపరిచాయి. తల్లిదండ్రులు వచ్చేసరికి బాలుడు రక్తపు మడుగులో ఏడుస్తూ కనిపించాడు.
వెంటనే వారు బాలుడిని ఓ ప్రయివేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి నీలోఫర్ ఆస్పత్రికి, ఆపై ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు ఆదివారం అర్ధరాత్రి మృతిచెందాడు. తాము గతంలో వీధి కుక్కలపై ఎన్నోసార్లు పోలీసులకు, జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశామని, కానీ ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.