పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలి

– జంతర్‌ మంతర్‌లో బీసీ సంఘాల ఆందోళన
న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్‌ కృష్ణయ్య కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రయివేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలన్నారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ లో భారీ నిరసన చేపట్టారు. ఎంపీలు బీద మస్తాన్‌ రావు, బడుగుల లింగయ్య యాదవ్‌, కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావు, ఇతర నేతలు ఈ నిరసనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌ కృష్ణయ్య ప్రసంగిస్తూ… అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అగ్రకులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టిన కేంద్రం, ఆ వర్గానికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. బీసీిలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండ గొర్రెలు, బర్రెలు, పందులు, పెన్షన్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని శాశ్వత బిచ్చగాళ్లుగా మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్ల పై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. వెనకబడిన వర్గాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, బీసీల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు రూపొందించాలన్నారు.