అందరికి ఆదర్శం …సుందరయ్య జీవనం

    పుచ్చలపల్లి సుందరయ్య అందరు అప్యాయంగా పిలుచుకునే పిఎస్. నెల్లూరు జిల్లా అలగానిపాడులో ఒక భూస్వామ్య కుటుంబంలో 1913 మే 1వ తేదిన జన్మించారు. పుచ్చలపల్లి వెంకట్రామిరెడ్డి, శేషమ్మ దంపతులకు ఏడుగురు సంతానం.సుందరయ్యకు నలుగురు అక్కలు, ఒక అన్న,ఒక తమ్ముడు. వారి తండ్రికి 50 ఎకరాల భూమి ఉండేది.వ్యవసాయంలో మంచి పనిమంతుడిగా అందరూ గౌరవించేవారు.1919వ సంవత్సరంలో అంటే సుందరయ్య ఆరేళ్ల వయస్సులో ఉన్నప్పుడే ఆయన తండ్రి మరణించాడు. సుందరయ్య ప్రాథమిక విద్యా ఊరి పంచాయితీ బడిలో సాగింది. చదువులో అందరి కంటే ముందుండేవాడు. బాల్యంలో ఉండగానే తన పేరు చివర కులాన్ని సూచించే రెడ్డిన్ని తొలడించుకొని సుందరయ్యగా ప్రజలందరి హృదయాలల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.

తొలి చైతన్యం:

1920 లో 16సంవత్సరాల తన అక్కయ్యను 42ఏళ్ల వీరాస్వామిరెడ్డి అనే మేజిస్ట్రేట్ కి ఇచ్చి వివాహం చేయాలని అనుకునప్పుడే ఆయన వ్యతరేఖించాడు. గ్రామంలో సాదారణంగా ఉండే కుల వివక్షకు వ్యతరేకంగా పెద్దలతో వాదనకు దిగేవాడు. చిన్నతనంలోనే చరిత్ర పుస్తకాలను ఎక్కువగా చదివేవాడు. తమిళనాడులో ఉండి చదువు సాగించేటప్పుడు విద్యార్థులకు మాతృభాషలోనే బోధించాలని అక్కడి ఉపాధ్యాయులతో వాదనకు దిగేవాడు. చిత్తరంజన్ దాసు మరణంతో ఆయన గురించి తెలుసుకొవాలనే ఆసక్తితో దినపత్రికలు చదవటం,కాంగ్రెస్ గురించి, జాతీయోద్యం గురించి తెలుసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు.జలియన్ వాలాబాగ్ నరమేధం గురించి తెలుసుకొవటంతో బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై ద్వేషం మరింత పెరిగింది. దానితోపాటే జాతీయోద్యంలో చేరాలని నిర్ణయించుకున్నాడు. 1928వ సంవత్సరంలో సైమన్ కమిషన్ బహిష్కరణకై దేశవ్యాపితంగా ఇచ్చిన పిలుపుతో సుందరయ్య తొలి క్రియాశీలకంగా రాజకీయ భాగస్వామ్యం మొదలైంది. స్కౌట్ యూనిఫారంలో గాంధీగారి సభకు వెళ్లినందుకు తప్పుపడితే అలాంటి ఆంక్షలుంటే నేను స్కౌట్ లోనే ఉండను అని చెప్పి స్కౌట్ యూనిఫారం వెనకు ఇచ్చేశాడు.

కమ్యూనిజం పరిచయం:

సుందరయ్య బొంబాయిలోని లయోలా కాలేజీలో చదువుతున్నప్పుడు యువజన సంఘం ప్రతినిధిగా హెచ్.డి.రాజా ఆ కాలేజీకి రావడం వీరికి కమ్యూనిస్టు ప్రణాళికను పరిచయం చేయటం జరిగింది. కమ్యూనిస్టు ప్రణాళిక సుందరయ్యను ఎంతగానో ప్రభావితం చేసింది.

కమ్యూనిస్టు పార్టీ:

సుందరయ్య బెంగుళూరులో ఉండగానే భారత కమ్యూనిస్టు ఉద్యమ ప్రారంభకులలో ఒకరైన అమీర్ హైదర్ ఖాన్ ఈయనను కలిసి కమ్యూనిస్టు పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించాడు. కానీ సుందరయ్య తన తల్లీకిచ్చిన మాట కోసం చదువు పూర్తి చేయకుండా రాజకీయాలలో చేరడంపై పూర్తిగా మాట ఇవ్వలేనని అయితే చదుకు కొనసాగిస్తూనే పార్టీకోసం చేయగలిగిందంతా చేయడానికి అంగీకరించాడు.తర్వాత కొంత కాలాన్నికి భారత కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. అప్పటికి ఆ పార్టీ నిషేధంలో ఉంది. 1930 దశకంలో దినకర్ మెహతా, సజ్జద్ జహీర్, .ఎమ్.ఎస్ నంబూద్రిపాద్, సోలీ బాట్లివాలా వంటి ముఖ్య కమ్యూనిస్టు నేతలు కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ జాతీయ కార్య నిర్వాహక వర్గం సభ్యలుగా ఉండేవారు.

1934 లో అమీర్ హైదర్ ఖాన్ జైల్ నుండి విడుదలైన తర్వాత సుందరయ్య మద్రాస్ వెళ్ళి కలుసుకున్నాడు.ఆ తరావాత దక్షిణ భారత దేశమంతా పర్యటించాడు. మరలా అమీర్ హైదర్ ఖాన్ అరెస్టు అవ్వడంతో ఉద్యమాన్ని సంఘటితం చేసే బాధ్యతను సుందరయ్య భుజాలపై పడింది. బొంబాయిలోని కేంద్రకమీటిసభ్యులతో సంబంధాలను పెట్టుకున్నాడు.ఆయన కొద్ది కాలంలోనే ఉమ్మడి మద్రాస్ రాష్ర్ట పార్టీ కమీటి కార్యదర్శి అయ్యాడు. అదే సంవత్సరం ఆయనను పార్టీ కేంద్ర కమీటి లోకి తీసుకున్నారు. మరల అదే సంవత్సరం కిసాన్ సభ వ్యవస్థాపక సభ్యుడయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించినపుడు,1939 నుండి 1942వరకు, నాలుగేళ్ళు అజ్ఞాతంలో గడిపాడు.1943లో నిషేధం ఎత్తివేశారు. తరవాత రెండవ పార్టీ కాంగ్రెస్ కలకత్తలో జరిగింది. రెండోవసారి సెంట్రల్ కమిటీ సభ్యునిగా సుందరయ్య ఎన్నికయ్యాడు. కలకత్తా సమావేశంలో పార్టీ సాయుధ పోరాటాన్ని సమర్ధిస్తూ తీర్మానం చేసింది.

వివాహం:

1942-1943 మధ్య కాలంలో బొంబాయిలోని పార్టీ కేంద్రానికి వెళ్ళాడు. రహస్య జీవితం గడుపుతున్న కామ్రేడ్స్ ను కలుసుకునేందుకు ఆ కేంద్రన్నికి సుందరయ్య వెళ్లినప్పుడు అక్కడే ఉన్న లైలాను కలుసుకొవడం జరిగింది. ఆమె అప్పటికే డిగ్రీ పూర్తి చేసి సెంట్రల్ బ్యాంకులో పనిచేస్తుంది. ఆమె తల్లి రహస్య కేంద్రంలో పార్టీ కామ్రేడ్స్ కు వంట చేసి పెడుతూ సహకరించేది. ఆమె ద్వారానే లైలా పార్టీ వైపు ఆకర్షితురాలై చురుగ్గా అంకాతభావంతో పనిచేస్తున్నది. అలా తమ రాజకీయ కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో లైలా సుందరయ్యలు పరస్పరం ఆకర్షితులైనారు. అలా వారి వివాహం 1943ఫిబ్రవరి 27న పార్టీ ప్రధాన కార్యదర్శి పి.సి.జోషి వద్దకు వెళ్ళి వారిద్దరూ భార్యభర్తలుగా ప్రకటించుకున్నారు.పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు ఆ బంధాలు, బాంధవ్యాలు అడ్డుతగులుతాయని పెళ్లికాగానే కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స చేయించుకొన్నారు.

వీర తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం:

1946-51 మధ్య కాలం ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ చరిత్రలో మైలు రాళ్ల వంటివి. ఆ కాలంలోనే చండ్ర రాజేశ్వరరావు ,మాకినేని బసవపున్నయ్య , రావి నారయణ రెడ్డి వంటి వారితో కలిసి భూస్వామ్య దొరలకు వారి మూల విరాట్టుగా ఉన్న నిజాం పాలనకు వ్యతరేకంగా తెలంగాణా రైతాంగ పోరాటాన్ని నడిపించాడు.నిక్కర్, హాఫ్ షర్ట్ ధరించి తుపాకి చేత పట్టి సాయుధడై ఉన్న సుందరయ్య గెరిల్లాలతో కలిసి అడుగులో అడుగు వేస్తూ కీరారణ్యంలో కఠోర శిక్షణ ఇచ్చాడు. ఆ రోజుల్లో తెలంగాణా ప్రజలు కేవలం నిజాం సేనలు, రజకార్లులను , దొరలనే కాక భారత ప్రభుత్వ సైన్యాలను కూడా ఎదురుకొనవల్సివచ్చింది. ఈ పోరాటం ద్వారా దున్నేవానికే భూమి నినాదంతో వేలాది ఏకరాలు పేదలకు పంచిపెట్టడం జరిగింది.ఈ సాయుధ పోరులో వేలాది మంది కర్యకర్తలు తమ ప్రాణాలు వదిలారు. ఆ తరువాత కాలంలో ఆ పోరాటాన్ని ఇంకెంత మాత్రం కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కూడా సుందరయ్య గెరిల్లా దళాలతో సంప్రదించిన తరువాతనే సుందరయ్య సాయుధ పోరాటాన్ని విరమించాడు.

పార్లమెంటులో,శాసనసభ లో ప్రతిపక్ష నేతగా:

స్వతంత్ర భారత దేశంలో జరిగిన మొదటి సాధారణ ఎన్నికలల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆ సభలో సుందరయ్య రాజ్యసభ నాయకుడిగా వ్యవహారించారు.పార్లమెంట్ లో అధ్యయనాత్మకమైన తన ప్రసంగాలు,హుందాతనంతో కూడిన ప్రవర్తనతో ఆయన అందరి మన్ననలు పోందారు. ”విశాలాంధ్రలో ప్రజారాజ్యంనినాదంతో భాషా ప్రయుక్త రాష్ర్టాల కోసం నిరంతరం పోరాడేవారు. ఆయన పార్లమెంట్ కు సైతం సైకిల్ పైనే వెళ్ళేవారు.

1952 శాసనసభ ఎన్నికలల్లో కూడా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. 1955-1967 వరకు సుందరయ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్షం నాయకుడిగా వ్యవహారించారు. అటు పార్టమెంట్ లో జవహార్ లాల్ నెహ్రూతోను ఇటు శాసనసభ లో నీలం సంజీవరెడ్డి తోను ప్రతిపక్ష నాయకుడిగా పోరాడేవారు సుందరయ్య .

భారత కమ్యూనిస్టు పార్తీ(మార్క్సిస్టు) ఆవిర్భవం:

1964 లో కలకత్తలో పార్టీ 7వ మహాసభ జరిగింది. నూతనంగా భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) ఆవిర్భవించింది.

పార్టీ తొలి ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ సుందరయ్య ఎన్నికైరు. తోమ్మిది మందితో మొట్టమొదటి పోలిట్ బ్యూరో ఏర్పడింది.ఆ తరవాత కొంత కాలం సుందరయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటికి ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. ఏ స్థాయిలో ఉన్న కార్యకర్తలను పేరుపేరునా పలకరించేవారు.

అజరమర నేత: 1981 నుండి ఆయన ఆరోగ్యం క్షీణించింది.1983లో మద్రాసులోని ఒక నర్సింగ్ హోమ్ లో ఆయన జీవన్మరణాల మధ్య ఊగిసలాడారు. కాని ఆయన దృఢ సంకల్పంతో ,వైద్యుల సంరక్షణతోను వ్యాదిని అధిగమించారు. ఏదిఏమైనా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూనే వచ్చారు.1985 మే 1వ తేదిన మరోసారి ఆస్పత్రిలో చేరిన ఆయన చివరకు మే19వ తేదిన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం కమ్యూనిస్టులకే కాదు అన్ని తరగతుల వారిని దిగ్ర్భాంతికి గురిచేసింది. విజయవాడలో జరిగిన ఆయన అంతిమయాత్రలో అశేష ప్రజానీకం ఆయనకు నివాళులర్పించారు.