మరింత మెరుగైన భవితవ్యం !

– చైనా-సెంట్రల్‌ ఆసియా దేశాల సదస్సు ప్రారంభం
– సమాన అవకాశాలు, సహకారమే కీలకం
– నేతలను స్వాగతించిన జిన్‌పింగ్‌ దంపతులు
జియాన్‌ : చైనా, సెంట్రల్‌ ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశం గురువారం ప్రారంభమైంది. ఈ తరహాలో మైలురాయి అనదగ్గ ఈ ఉన్నత స్థాయి సదస్సు ప్రారంభమైన తీరు, చైనా దౌత్య ఎజెండాలో సెంట్రల్‌ ఆసియాకు పెరుగుతున్న ప్రాముఖ్యతను తెలియచేస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సంక్లిష్టమైన అంతర్జాతీయ, ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో చైనా ఇంధనం, వ్యూహాత్మక భద్రతకు పెరుగుతున్న ప్రాముఖ్యతను తెలియచేస్తోందన్నారు. జియాన్‌లో టాంగ్‌ వంశానికి చెందిన ఇంపీరియల్‌ గార్డెస్‌లోని టాంగ్‌ ప్యారడైజ్‌ వద్ద సెంట్రల్‌ ఆసియా నేతలు, వారి సతీమణులను చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌ దంపతులు సాదరంగా స్వాగతించారు. అంతర్జాతీయంగా ఎన్ని మార్పులైనా జరగనీ, దానితో నిమిత్తం లేకుండా చైనా, సెంట్రల్‌ ఆసియా దేశాలు ఎల్లప్పుడూ పరస్పరం గౌరవించుకుంటారని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య వుండే స్నేహ సంబధాలను కొనసాగిస్తామన్నారు. సమాన అవకాశాలు, సహకారానికి కట్టుబడతామన్నారు. ఇరుగు పొరుగు దేశాల స్థాయి నుండి వ్యూహాత్మక భాగస్వాములు అక్కడ నుండి భవితవ్యాన్ని పంచుకునే కమ్యూనిటీ స్థాయికి చైనా సంబంధాలు అభివృద్ధి చెందాయ న్నారు. ఇటువంటి సంబంధా లెప్పుడూ ప్రాంతీయ శాంతి, అభివృద్దికి సానుకూల శక్తిని చొప్పిస్తాయన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందు తున్న చైనా ఎక్స్‌ప్రెస్‌లోకి ఎక్కాల్సిందిగా సెంట్రల్‌ ఆసియా దేశాలకు స్వాగతం పలుకుతున్నామన్నారు. చైనా-సెంట్రల్‌ ఆసియా సహకారానికి మరింత మెరుగైన భవితవ్యాన్ని కలిసి సృష్టిద్దామన్నారు. కజక్‌, తజక్‌, కిర్గిజ్‌ అధ్యక్షులు బుధవారానికే జియాన్‌ చేరుకోగా, ఉజ్బెక్‌, తుర్క్‌మినిస్తాన్‌ అధ్యక్షులు గురువారం చేరుకున్నారు. వారందరితో విడివిడిగా గురువార మే చర్చలు జరిపారు. అనంతరం కిర్గిస్తాన్‌, తజకిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌ నేతలతో జిన్‌పింగ్‌ సంయుక్త డిక్లరేషన్‌లపై సంతకాలు చేశారు.