రాజకీయంగా, ఆర్థికంగా దేశంలో అత్యంత కీలకపాత్ర వహించే మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు బీజేపీ, ఎన్డీయేలకు అమితానందం కలిగిస్తే కాంగ్రెస్, ఇండియా కూటమిని తీవ్ర నిరుత్సాహానికి గురిచేశాయి. నవంబరు 20న పోలింగ్ ముగిసిన ఈ రాష్ట్రంలో ఫలితాలు 23వ తేదీన వెలువడ్డాయి. సాధారణ అంచనాలు ఎగ్జిట్‌పోల్స్ లెక్కలు తారుమారయ్యాయి. బీజేపీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన,అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి చీలిక గ్రూపులతో ఏర్పడిన పాలక మహాయతి కూటమి 288 స్థానాల్లో 230 పైగా తెచ్చుకుని ఘన విజయం సాధించింది. బీజేపీకి 132, ఏక్‌నాథ్ షిండే శివసేనకు 57, అజిత్ పవార్ ఎన్‌సిపిఎకి 41 వచ్చాయి. మరోవైపున ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్ థాక్రే), ఎన్‌సిపి(శరద్ పవార్)లతో కూడిన మహా వికాస్ అగాదీ కూటమి పార్టీలలో ఏ ఒక్కటీ ప్రతిపక్ష హోదా కూడా పొందలేక పోయాయి. నిజానికి సేన, ఎన్‌సిపి మూల సంస్థలు ఎంవిఎలో వున్నా పోటీనేతలతో చీలిపోయిన గ్రూపులే అధిక స్థానాలతో వీళ్లను వెనక్కు నెట్టేశాయి. ఆరుమాసాల కిందట జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎంవియు 30 స్థానాలు తెచ్చుకుని సంచలనం సృష్టించింది. మహాయతి కేవలం 17 స్థానాలకే పరిమితమైంది.అదే సమ యంలో రెండు కూటముల మధ్య తేడా కేవలం 0.4శాతం మాత్రమే వుండటం వల్ల శాసనసభ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
లోక్‌సభ ఓటింగులో జాతీయ రాజకీయ కోణాలు ప్రధానంగా పనిచేస్తాయి.శాసనసభ ఎన్నికలు రాష్ట్రాల ను బట్టి జరుగుతాయి. అక్కడ ఎక్కువ స్థానాలు వచ్చినా అసెంబ్లీ వ్యవహారం భిన్నంగా వుండొచ్చని గతంలో చాలా సార్లు రుజువైంది. అందుకే ఇండియా కూటమి, ప్రత్యేకించి ప్రధానపాత్ర వహించే కాంగ్రెస్ వాస్తవికత చూపించాలని పరిశీలకులు, భాగస్వామ్య పక్షాలు పదేపదే హెచ్చరిస్తూ వచ్చాయి. హర్యానా లోక్‌సభ ఎన్నికలలో సరిసమానంగా సీట్లు తెచ్చుకుని అధికారం లోకి రావడం ఖాయమని హడావుడి చేసిన కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతిన్న అనుభవం పనిచేస్తుందని భావిం చారు. లౌకిక శక్తుల ఐక్యతకు, సర్దుబాట్లకు ప్రాధాన్యత నివ్వకపోవడమే హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి కారణమని తేల్చిచెప్పారు. దీనికి అంతర్గత అనైక్యత కూడా తోడై పరాజయం తీవ్రమైంది. మహారాష్ట్రలోనైనా అలాంటివి మార్చుకోకపోగా అంత కంటే ఘోరంగా దెబ్బతినడం వారికే దిగ్భ్రాంతి కలిగిం చింది. శివసైనపై ఉద్ధవ్‌ఠాక్రే పట్టు సడలిందా, ఎన్‌సిపి కౌటిల్యుడు శరద్‌పవార్ ప్రభ తగ్గిందా వంటి ప్రశ్నలూ ముందు నిలిచాయి. మరోవైపు అంత విజయం సాధించిన బీజేపీ కూటమి కూడా ముఖ్యమంత్రి ఎంపిక పూర్తి చేసుకోలేక పోవడం బట్టి రాజకీయ సవాళ్లు అర్థమవు తాయి. ఇప్పటికే షిండే అలిగి ఊరెళ్లిపోయారు. అయితే ఏదో విధంగా అవసరమైతే షిండేను తప్పించైనా సరే బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్‌కే పదవి కట్టబెడుతుందని అందరికీ తెలుసు. ధృతరాష్ట్ర కౌగిలిలా బీజేపీతో మరీ ముఖ్యంగా మోడీతో అంటకాగిన వారు ఆఖరుకు ఏమవు తారో చెప్పే ఉదాహరణ షిండే. అయినా తెలుగునాట కొందరు నేతలు అందుకు ఆరాటపడుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తున్నది.
రంగంలోకి ఆరెస్సెస్..
మహారాష్ట్రలో సీట్ల ఎంవిఎ సర్దుబాటు చర్చల నుంచి నియోజక వర్గాల కేటాయింపు వరకూ అస్తవ్యస్తంగానే జరిగింది. మూడు ప్రధాన పార్టీలే తేల్చుకోలేకపోగా వామపక్షాలు, ఇతర లౌకికపార్టీలతో సకాలంలో సరైన చర్చలే జరగలేదు. మరోవైపు బీజేపీ ఎలాగైనా లోక్‌సభ ఫలితాలను మార్చి అధికారంలోకి రావడమే ఏకైక ధ్యేయంగా వ్యవహరించింది. చివరి మాసాలలో లడ్కీ బహెన్ యోజన వంటి పథకాలను ప్రకటించి రూ.1500 ఆగమేఘాల మీద బదిలీచేసింది. ఎంవిఎ రూ.3వేలు ఇస్తామని వాగ్దానం చేసినా అధికారంలో వుండి తక్షణం ఖాతాల్లోకి పంపించారు గనక ఎక్కువ పనిచేసిందని చెబుతున్నారు. దీనికి తోడు కుల, మత ప్రచారాలను మహాయతి నేతలు దారుణంగా సాగించారు. స్వయంగా మోడీ బీసీ ప్రధాని వుండటం ఇష్టం లేకనే ఓడించాలని చూస్తున్నారని రెచ్చగొట్టారు.కలసి వుండాలని చెబుతున్నట్టుగా ఏక్‌హైతో సాఫ్‌హై, బటేంగోతో పటేంగే వంటి నినాదాలతో హిందు మతతత్వ రాజకీయాలను ప్రచారం చేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల త్రయం తోడు ఆరెస్సెస్ నేరుగా రంగంలోకి దిగి ఇంటింటికీ తిరిగి జాతీయత, మతం అంటూ ప్రచారం నడిపించింది. అసలు తమ వల్లనే ఈ విజయం సాధ్యమైందని కూడా వారి వాదనగా వుంది. ఎంవిఎను తికమక పెట్టేందుకు గాను శరద్‌పవార్ బీజేపీతో చేతులు కలిపారనే ప్రచారం నడిపించారు. 2019లో బీజేపీిని బలపర్చడానికి శరద్‌పవార్ ఆదేశాలపైనే బీజేపీతో చర్చలు జరిపామనీ, అప్పట్లో అదానీ కూడా ఆ చర్చల్లో పాల్గొన్నారని అజిత్‌పవార్ వెల్లడించారు. అదానీ ఇంట్లో చర్చలు జరిగాయి గానీ ఆయనతో భోజనం మాత్రమే చేశామనీ, చర్చల్లో లేరనీ శరద్‌పవార్ వివరణ ఇచ్చినా కలసిన సంగతి మాత్రం కొట్టివేయలేదు. అంతేగాక అజిత్‌పవార్‌తో ఆయన కుటుంబ సంబంధాలు కూడా లేనిపోని చర్చలయ్యాయి
కూటమిలో తనే అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని పట్టుపట్టిన కాంగ్రెస్ ప్రచారంలో అంత పదునుగా పాల్గొనలేదు. ఆఖరుకు రాహుల్‌గాంధీ కూడా పరిమితంగా తప్ప మీదేసుకుని ప్రచారం చేసింది లేదు. సంప్రదాయ శివసేన ఓటర్లను ఉద్ధవ్‌ఠాక్రే ఆకట్టుకోలేకపోయారు. ఎంవిఎ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ఉద్ధవ్‌ను ప్రకటించక పోవడంతో మరాఠా ఆత్మగౌరవ భావన దెబ్బతిన్నదనే ప్రచారం ప్రభావం చూపింది. స్వయంగా ఉద్ధవ్ కూడా ముందే సీఎం పేరు ప్రకటించి వుండాల్సిందని అసంతృప్తి వెలిబుచ్చారు. సీపీఐ(ఎం), సీపీఐ, ఎస్‌పి వంటి పార్టీలను కలుపుకోవలసిన అవసరాన్ని అసలే గుర్తించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ(ఎం)కు సీట్లే కేటాయించకపోయినా ఓట్ల చీలిక నివారించడం కోసం పోటీచేయకుండానే మద్దతునిచ్చింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అనేక విమర్శల తర్వాత మూడు స్థానాలు కేటాయించి మళ్లీ ఒకచోట పోటీ పెట్టింది కాంగ్రెస్. దహను, సోలాపూర్, కల్వాన్‌లలో సీపీఐ(ఎం) పోటీచేయగా, సేన,ఎన్‌సిపి మూడు చోట్ల మద్దతునిచ్చినా సోలాపూర్‌లో కాంగ్రెస్ పోటీచేసి బీజేపీ గెలవడానికి కారణమైంది. సీపీఐ(ఎం) ఈ స్థానంలో పదోసారి విజయం సాధించడం ఒక విశేషం.ఎస్‌పి విషయంలోనూ ఇదే జరిగింది.లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు తర్వాత కాంగ్రెస్ చూపంతా ముఖ్యమంత్రి పీఠంపైనే వుండి కూటమి భాగస్వాములను కించపర్చింది. లోక్‌సభ ఎన్నికల్లో ముందుగా సర్దుబాట్లు పూర్తయిన రాష్ట్రం మహారాష్ట్ర కనుకనే ఫలితాలు స్పష్టంగా వచ్చాయి. కానీ ఈసారి హర్యానా తప్పులను పునరావృతం చేసింది కాంగ్రెస్. అక్కడా ఎస్‌పి, ఆప్‌లను అసలు కలుపుకోలేదు. హర్యానా ఓటమి తర్వాత ఆక్రోశం వ్యక్తం చేశారు రాహుల్‌గాంధీ. కాగా తాజాగా జరిగిన ఆ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ పని చేశారు. ఏది ఏమైనా కాంగ్రెస్ సంకుచితత్వం,దూరదృష్టి లోపం వల్ల లోక్‌సభ ఎన్నికల విజయంతో వచ్చిన సదవకాశం సగం వెనక్కు పోయినట్టయింది. బలం లేకున్నా ఎక్కువ సీట్లు కావాలని పట్టుపట్టడం, తర్వాత చతికిల పడటం పరిపాటిగా మారింది. బీహార్ ఎన్నికల్లోనూ నాలుగేళ్ల కిందట వెంటపడి మరీ 70సీట్లు తీసుకుని పోటీచేసిన ఆ పార్టీ కేవలం 19 గెలవగలిగింది. అదే ఆర్జెడి వామ పక్షాల గెలుపు శాతం చాలా ఎక్కువగా వుంది. యూపీలోనూ అంతే. ఆరెంటితో పాటు తమిళనాడులో కూడా ‘ఇండియా’ కూటమి సీట్లు పెరిగాయంటే అది ఇతర మిత్రుల విజయాల వల్ల తప్ప కాంగ్రెస్ వల్ల కాదు. ఎందుకంటే కాంగ్రెస్ యంత్రాంగం, నిర్మాణబలం, విధాన స్పష్టత కూడా తగ్గిపోతున్నాయి. మహారాష్ట్రలో మాలెగావ్ వంటిచోట్ల వచ్చిన ఓట్లశాతం చూస్తే మైనార్టీలు కూడా కాంగ్రెస్‌కు దూరంగా పోతున్నట్టు అర్థమవుతున్నది. మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చౌహాన్, ప్రతిపక్ష నేత బాలాసాహెబ్ దొరోట్ వంటివారు కూడా గెలవలేక పోయారు. 101 సీట్లలో పోటీ చేసి 16 మాత్రమే తెచ్చుకోగలిగింది. ఇందులో తొమ్మిది విదర్భలోనే. వాయువ్య భారత్‌లో మొత్తం లోక్‌సభ స్థానాలుండగా బీజేపీతో ఆ పార్టీ ముఖాముఖి తలపడిన 75సీట్లలో కేవలం తొమ్మిది మాత్రమే తెచ్చుకోగలిగింది. కనుక తన బలం గురించి అతి అంచనాలు మాని లౌకిక పార్టీల లో ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరించకపోతే కాంగ్రెస్ కోలుకోవడం కూడా కష్టమే. కార్మిక హక్కులు,రైతాంగ సంక్షోభం వంటివాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టవలసిన అవసరం కూడా గ్రహించాల్సి వుంది. రైతాంగ ఆందోళనకు మార్గం చూపిన మహారాష్ట్ర ఉద్యమాల ప్రభావం ఎన్నికల ఓటింగులో ప్రతిబింబించలేదంటే కాంగ్రెస్, ఎంవిఎల వైఖరి మాత్రమే కారణం. దీనికితోడు ఇవిఎంలు, ఓట్ల సంఖ్యలో తేడా వంటివి కూడా పరిశీలించాల్సి వుంది.
జార్ఖండ్ ఉపశమనం..
జార్ఖండ్ విషయానికొస్తే ముఖ్యమంత్రి హేమంత సొరేన్‌ను జైలుపాలు చేసి వెంటాడిన తీరును ఓటర్లు తోసిపుచ్చారు. కూటమిలో కాంగ్రెస్ 16, ఆర్‌జెడి4, ఎంఎల్2 తెచ్చుకున్నాయి. ఇక బీజేపీకి 21 రాగా ఆ కూటమిలోని ఎల్జేపి, ఎజెఎస్‌యు, జెడియులకు ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి. బీజేపీ సీట్ల శాతం తగ్గిపోగా ఇండియా వేదిక పార్టీల సీట్లు పెరిగాయి.ఇది కూడా అనేక ఎగ్జిట్‌పోల్స్ చెప్పిన దానికి విరుద్ధం.అయితే ఇక్కడ కూడా కాంగ్రెస్ బీజేపీతో నేరుగా తలపడిన 12చోట్ల ఓటమి చవిచూసింది.ఇక ఇప్పుడు జార్ఖండ్ సర్కారు ముందు తీవ్ర ఆర్థికసవాళ్లు వుంటాయి. కేంద్రం వివక్ష లేకుండా సహకరించాలని ‘హిందూ’ పత్రిక సంపాదకీయమే రాసింది.
ఉప ఎన్నికల తీరు
ఈ రెండు రాష్ట్రాల శాసన సభలతో పాటు అనేక లోక్‌సభ శాసనసభల స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా మిశ్రమంగానే వున్నాయి. కేరళలో చూస్తే లోక్‌సభ ఎన్నికల్లో వెనకబడిన ఎల్‌డిఎఫ్ మళ్లీ పుంజుకున్నదని ఈ ఫలితాలు నిరూపించాయి. ఇక దానిపని ముగిసినట్టేనని బీజేపీ, కాంగ్రెస్ అనుకూల శక్తులు రొదపెట్టినప్పటికీ ఓటర్లు అదితప్పని చాటిచెప్పారు.
చెలకరలో యుడిఎఫ్ అభ్యర్థి గెలుపు ఖాయమని మీడియా హోరెత్తినా ఎల్‌డిఎఫ్ అభ్యర్థి యుఆర్ ప్రదీప్ 12వేల ఓట్లకు పైగా తేడాతో గెలుపొందారు. మతపార్టీల సాయంతో పాలక్కాడ్‌ను కాంగ్రెస్ నిలబెట్టుకున్నా ఎల్‌డిఎఫ్ ఓట్లు గణనీయంగా పెరిగాయి. ఇక వయనాడ్‌లో ప్రియాంక గాంధీ అధిక మెజార్టీతో లోక్‌సభకు ఎన్నికైనా ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేని వ్యక్తిగత కుటుంబ వ్యవహారంగానే చూస్తున్నారు. పైగా మహారాష్ట్ర, హర్యానా దెబ్బలతో కాంగ్రెస్ ఏ మాత్రం సంతోషించగల స్థితిలో లేదు. ఈ ఉప ఎన్నికల తర్వాత మూడోసారి పినరయి విజయన్ ప్రభుత్వం వస్తుందని సీపీఐ(ఎం) విశ్వాసం వెలిబుచ్చుతోంది.
ఇక రాజస్థాన్‌లో ఎన్నికలు జరిగిన ఏడు సీట్లలో అయిదు బీజేపీ, ఒకటి కాంగ్రెస్, ఒకటి ఇతరులు, యూపీ మొత్తం తొమ్మిదిలో ఏడు బీజేపీ(మిత్రపార్టీతో సహా) రెండు ఎస్‌పి, బెంగాల్‌లో ఉప ఎన్నికలు జరిగిన మొత్తం ఆరు సీట్లు తృణమూల్, ఛత్తీస్‌గఢ్‌లో ఒక చోట బీజేపీ, పంజాబ్‌లో మూడు చోట్లా ఆప్, కర్నాటకలో జరిగిన మూడు చోట్ల కాంగ్రెస్, బీహార్‌లో నాలుగుకు నాలుగు బీజేపీ గెలుచుకున్నాయి.అంటే ఉత్తర వాయువ్య భారతంలో బీజేపీ ఆధిక్యత సాధించగా దక్షిణాదిన మాత్రం వెనకబడి పోయినట్టు మరోసారి వెల్లడైంది.వేర్వేరు పార్టీలు ఈ ఫలితాలను ఎలా విశ్లేషించుకుని భవిష్యత్ విధానాలు రూపొందించుకుంటాయో చూడవలసిందే. ఏమైనా ‘ఒకేదేశం-ఒకే ఎన్నిక’ పాట ఎంత పొరపాటో ఈ రకరకాల ప్రజాతీర్పులతో స్పష్టమైపోతున్నది.
– తెలకపల్లి రవి