‘బిల్లు’ భిక్ష కాదు… హక్కు!

'Bill' is not alms... a right!దశాబ్దాలుగా నానుతున్న చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లుకు రాజ్యసభ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడమే తరువాయి రానున్న కాలంలో ఇది చట్టంగా మారనుంది! అయితే ఇది చట్టంగా మారేందుకు కీలకమైన రాష్ట్రపతే తగిన గౌరవానికి నోచుకోకపోవడం విచారకరం. ఈ బిల్లు ఆమోదం పొందడం పట్ల బీజేపీ నేతలు పార్లమెంట్‌లో తమ చేతులతో బల్లలు చరిచారు. బయట కొచ్చి జబ్బలు చరుస్తున్నారు. ఇదంతా మోడీ ఛరిష్మా అని విజయగర్వంతో ఊగిపోతున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ మేఘవాల్‌ ఈ బిల్లును ప్రవేశ పెట్టిన సమయంలో అధ్యక్ష స్థానంలో పీటీ ఉష ఉన్నారు. ఈమె పరుగుల రాణిగా దేశమంతటా సుపరిచితం. కానీ బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ చేతిలో లైంగికదాడులకు గురైన తోటి రెజ్లర్లు అతన్ని శిక్షించాలని పోరాటం చేస్తుంటే, వారి దీక్షలను భగం చేసేలా విరమణ కోసం ప్రయత్నించిన బీజేపీ నాయకురాలు ఆమె. ఇలాంటి వాళ్లు మహిళల రక్షణ గురించి నేడు మాట్లాడుతున్నారు. చర్చల్లో పాల్గొంటున్నారు. మోడీని కీర్తిస్తున్నారు. మహిళలపై బీజేపీకి నిజంగా ప్రేముందా? వారిని రాజకీయంగా అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉందా? ఇన్నేండ్ల వారి పాలనలో స్త్రీ సంక్షేమం అణువంతైనా కనిపించిందా? వారిదంతా అసమానతల రాజకీయమే కదా!
రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని అమలు చేయాలనేది బీజేపీ-ఆరెస్సెస్‌ వ్యూహం. మనుస్మృతిలో మహిళల స్థానమెక్కడీ అనాదిగా వస్తున్న అధర్మాలపై పాలన సాగిస్తున్న నేతలు నేడు మహిళల గురించి గొప్పగా మాట్లాడటం విడ్డూరం! వారిని అలుసుగా చూస్తూ వంటింటికే పరిమితం చేసే సనాతనను నమ్ముతూ, దాని ప్రకారమే ముందుకు నడిచే వీరు నేడు మహిళలు, వారి అభివృద్ధి గురించి చెప్పడం నమ్మశక్యమేనా? కుల వివక్ష, అంటరానితనం దేశంలో రాజ్యమేలు తుంటే అందులో విభజన రాజకీయాలు చొప్పించి పబ్బం గడుపుకునే బీజేపీ మహిళల గురించి కల్లబొల్లి కబుర్లు చెబితే నమ్ముతుందా ఈ లోకం? మణిపూర్‌ మతం మంటల్లో కాలిన మహిళల నగ మృతదేహాలు ఏం ఘోషిస్తున్నాయి? ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో తీసుకొస్తున్న అసమానతలు ఏం సూచిస్తున్నాయి? కుల వివక్షలో ఛిద్రమైన బతుకులు ఏం చెబుతున్నాయి? ఈ బిల్లు తెచ్చింది మహిళల కోసం కానేకాదు! వారి పాలనలో అశాంతికి గురైన వారిని శాంతపరచడానికి, అన్యాయానికి గురైన వారిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి! నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఆ పార్టీకి వివక్ష అనేది లేదనుకుంటే గిరిజన బిడ్డ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నూతన పార్లమెంట్‌ ప్రారంభోత్స వానికి ఎందుకు పిలవలేదు? పోనీలే అనుకుందాం. ఇటీవల పార్లమెంట్‌లో మహిళా బిల్లును ప్రవేశపెట్టినప్పుడైనా ఆమె గుర్తుకురాలేదా? సరే… ఇది కూడా సర్దుకుందాం. మరి ప్రముఖ బాలీవుడ్‌ నటీ కంగనా రనౌత్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌ రీనా ఢాకాను ఆహ్వానించినప్పుడైనా ఆమె గుర్తుకు రాలేదా?
వివక్ష అనేది ఎన్డీయేలోనే కాదు బీజేపీ డీఎన్‌ఏలోనూ ఉంది. వీరి పాలనలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని, ఇప్పుడు రాజకీయంగా ఎదుగుతారని చెప్పడమంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదు. బీజేపీ ఈ పదేండ్ల పాలనలో మందబలంతో ఎన్నో చట్టాలను రూపొందించింది. ప్రతిపక్ష సభ్యులు నెత్తీనోరు మొత్తుకున్నా వారిని లెక్క చేయలేదు. దేశ సమగ్రతకు భంగం కలిగే చట్టాలు, అదానీ, అంబానీలకు ఉపయోగపడే చట్టాలు, దేశాన్ని అస్థిరపరిచే చట్టాలు ఎన్నెన్నో తీసుకొచ్చింది. మరి చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ డిమాండ్‌ ఎప్పటినుంచో పోరాడుతున్నదే. ఇప్పుడే దాన్ని చర్చకు పెట్టి ఆమోదించడం వెనుక ఉన్న మతలబేంటో తెలియనిది కాదు. ఇందులో దాగుంది సమీపిస్తున్న ఎన్నికల రాజకీయ కోణమే కదా! ఎన్నికల్లో ఎలాగైనా లబ్ది పొందాలని ఇటీవల గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గించారు. ఇప్పుడు మహిళా బిల్లును తామే తెచ్చామని కొత్తనాటకానికి తెరదీస్తున్నారు. ఈ బిల్లు విజయం పురుషాధిక్య సమాజంలో అణచబడిన మహిళాలోకానిదే. ఎన్నో ఏండ్లుగా అలుపెరగకుండా చేస్తున్న సుధీర్ఘ పోరాట పటిమదే. ఇందులో బీజేపీ, మోడీ కృషి ప్రత్యేకంగా ఏమీ లేదు. మహిళల పట్ల సానుభూతిని ప్రకటించడం, వారిని ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదమే. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇది బీజేపీ భిక్ష కాదు…