అప్పుడు ‘పుష్ప’, ఇప్పుడు ‘కల్కి’, ‘భారతీయుడు 2’ సినిమాలను చూసిన తర్వాత అసలు రెండు భాగాలుగా సినిమాలు చేయాల్సిన అవసరం ఏముందని అనిపించక మానదు. విషయం లేకుండా సాగతీత ధోరణితో బోర్ కొట్టిస్తున్న ఈ రెండు భాగాల సినిమాల విషయంలో ప్రేక్షకులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇదే తీరు కొనసాగితే వారి నిరాదరణతో తెలుగు సినిమా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
కంటెంట్ లేకుండా సహనానికి పరీక్ష పెడితే ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో ఇటీవల విడుదలైన ‘భారతీయుడు 2’ చిత్రం చెప్పకనే చెప్పింది.
అవినీతిపై పోరాటం నేపథ్యంలో కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా అప్పట్లో ఒక సంచలన చిత్రం. దీనికి కొనసాగింపుగా ఇటీవల ‘భారతీయుడు 2’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
కమల్, శంకర్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకపోగా, ప్రతి సన్నివేశంలో విపరీతమైన సాగతీత ధోరణి ఉండటంతో ప్రేక్షకులను మరింత చిరాకు పెట్టింది. దీంతో అసలు ఎందుకు రెండో పార్ట్‌గా సినిమా తీశారు?, పైగా దీనికి కొనసాగింపుగా పార్ట్ 3 అవసరమా.. అని తీవ్ర అసంతృప్తిని సైతం వ్యక్తం చేశారు. ఈ అసంతృప్తి సెగ మేకర్స్‌కి అర్థం అవటంతో దాదాపు మూడు గంటల నిడివి ఉన్న ఈ రెండో భాగంలో ఏకంగా 20 నిమిషాల సన్నివేశాలను కట్ చేశారు.
విందు భోజనానికి పిలిచి సగం భోజనం పెట్టి పంపిస్తే ఎలా ఉంటుందో, సగం సగం కథలతో వస్తున్న సినిమాల విషయంలోనూ ప్రేక్షకుల పరిస్థితి అలాగే ఉంది. జయాపజయాల విషయం పక్కన పెడితే ఈ సినిమాల కోసం ప్రేక్షకులు ఒక సినిమానే రెండు టిక్కెట్లు పెట్టి చూశారు. పైగా అధిక ధరలతో టిక్కెట్లను కొనుగోలు చేసి మరీ చూశారు.
మొదటి భాగంలో జస్ట్ కథని, పాత్రల తీరుని పరిచయం చేసి, రెండో భాగంలో అసలు కథని చెబుతున్నారు.
కానీ అప్పటి వరకు ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తున్నారు.
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమా మూడేళ్ల క్రితం వచ్చి పెద్ద విజయం సాధించింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సగం కథనే చెప్పారు. అసలు కథ స్టార్ట్ అవుతుందనే సమయంలోనే, విలన్‌తో హీరోకి ఉన్న రివేంజ్‌ని పరిచయం చేసి మొదటి భాగాన్ని ముగించారు. ఇక రెండో భాగం ‘ఫుష్ప2’ చిత్రాన్ని అదిగో రిలీజ్, ఇదిగో రిలీజ్ అంటూ రకరకాల రిలీజ్ డేట్స్‌ని మారుస్తూ చివరకు డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన ‘సలార్’ విషయంలోనూ అదే జరిగింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్‌లో వచ్చింది. ఇందులోనూ అసలు కథ చెప్పలేదు. పాత్రల పరిచయం చేసి, కథ ఊపందుకునే లోపు మొదటి భాగాన్ని ముగించారు. అసలు కథని రెండో భాగానికి దాచి పెట్టారు. ప్రభాస్ ఎలివేషన్లు, పాత్రల పరిచయానికే మూడు గంటలు తీసుకోవడం గమనార్హం. ఇక ‘సలార్ 2’ ఎప్పుడొస్తుందో మేకర్స్‌కే ఎరుక. ఇక తాజాగా వచ్చిన ‘కల్కి2898ఏడీ’ సినిమా విషయంలో ఇదే తీరు జరిగింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఇప్పటికే రూ.1000కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. అయితే ఈ సినిమా ఫస్టాఫ్‌లో అసలు కథే ఉండదు, పాత్రల పరిచయంతో పాటు కథేంటో సింగిల్ లైన్‌లో చెప్పినట్టు చేశారు. సెకండాఫ్‌లో అసలు కథ స్టార్ట్ అవుతుంది. కథ ఊపందుకునే లోపే ఎండ్ కార్డ్ పడుతుంది. పైగా సినిమా ఎండ్ వరకు స్లో నెరేషన్‌తో లాక్కుంటూ వచ్చి, ఎండ్‌లో మహాభారతం ఎలిమెంట్లు, ప్రభాస్ ఎలివేషన్లు ఇచ్చి ముగించారు.
ఇక అసలు కథ ఏంటో తెలియాలంటే ‘కల్కి 2’ రిలీజ్ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ‘కల్కి’ సినిమా ఫస్టాఫ్ స్లోగా ఉండటాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ అంగీకరించడం, కావాలనే చేశామని చెప్పడం గమనార్హం. కానీ ఈ సినిమాలోని విజువల్స్ హాలీవుడ్ స్థాయిని మించి ఉన్నాయని అందరూ మెచ్చుకోవడం విశేషం.
సినిమా అనేది వ్యాపారం. సినిమాని రెండు భాగాలుగా తీసుకురావడం వెనుక భారీ వాణిజ్య కోణం ఉంది. దీన్ని మేకర్స్ బాగానే క్యాష్ చేసుకుంటున్నారు.
కానీ ఈ సినిమాలను తీసుకున్న బయ్యర్లు నష్టపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ‘కల్కి’ సినిమా వెయ్యి కోట్లని సాధించింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని తీసుకున్న బయ్యర్లకు ఇంతవరకు బ్రేక్ ఈవెన్ రాలేదని వినిపిస్తోంది.
బలమైన కథ ఉన్నప్పుడు రెండు భాగాలుగా చెప్పడంలో తప్పులేదు. కానీ అవసరం లేని, పెద్దగా కథలేని సినిమాల విషయంలోనూ అదే ఫార్మూలాని ఫాలో అవుతుండటం తెలుగు చిత్ర సీమకు క్షేమదాయకం కాదని మేకర్స్ తెలుసుకోవాలి.
– అయితగోని రాజు