అదానీకి ఎదురు దెబ్బ

– నోయిడాలో గ్యాస్‌ సరఫరాకు అనుమతి నిరాకరణ
న్యూఢిల్లీ : రాజధాని న్యూఢిల్లీ శివారులోని నోయిడాలో నివాస గృహాలకు పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా చేసేందుకు అదానీ గ్రూప్‌ చేసిన ప్రయ త్నాలు ఫలించలేదు. ఇందుకోసం అదానీ టోటల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ పెట్టుకున్న దరఖాస్తును కేంద్ర పెట్రోలియం, సహజవాయువు రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) తోసిపుచ్చింది. ఆటో మొబైల్స్‌కు సీఎన్‌జీ లైసెన్స్‌ కోసం చేసిన అభ్యర్థనను కూడా తిరస్కరించింది.
చట్ట నిబంధనలను అదానీ టోటల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ పాటించలేదని, అందుకే దరఖాస్తును తిరస్కరించామని ఈ నెల 14న ఇచ్చిన ఆదేశాలలో రెగ్యులేటరీ బోర్డు వివరించింది. రాజధాని పొరుగున ఉన్న నగరాలలో సిటీ గ్యాస్‌ పంపిణీ (సీజీడీ) లైసెన్స్‌ కోసం అదానీ రెండు దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. రెగ్యులేటరీ బోర్డు లేదా కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందిన సంస్థ మాత్రమే ఏ నగరంలో అయినా పైప్‌లైన్‌ ద్వారా సహజ వాయువును సరఫరా చేయగలదు. ప్రభుత్వ రంగం లోని సంస్థలు ఉమ్మడి భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన ఇంద్రప్రస్థ గ్యాస్‌ లిమిటెడ్‌ (ఐజీఎల్‌) 1990వ దశకం నుండీ రాజధానిలో గ్యాస్‌ సరఫరా చేస్తోంది. సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంస్థకు సిటీ గ్యాస్‌ లైసెన్స్‌ మంజూరు చేశారు. పరిసర నగరాలలో కూడా తానే ఈ సేవలు అందిస్తానని ఆ కంపెనీ ప్రతిపాదించగా అదానీ గ్రూపు వ్యతిరేకించింది.
సుప్రీంలో చుక్కెదురు
నోయిడాలో గ్యాస్‌ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం 2004 ఏప్రిల్‌ 8వ తేదీనే ఐజీఎల్‌కు అనుమతి ఇచ్చింది. అయితే నోయిడా భౌగోళిక ప్రాంతంలో సహజవాయువు పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేసే అధికారం తనకే ఉన్నదని 2008 జూన్‌ 25న అదానీ టోటల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. అయితే ఆ కంపెనీ దరఖాస్తును రెగ్యులేటరీ బోర్డు అనుమతించ లేదు. దీంతో వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. వివాదాన్ని పరిష్కరించే అధికారం బోర్డుకే ఉన్నదని సుప్రీంకోర్టు గత సంవత్సరం సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చింది. దీంతో అదానీ కంపెనీ దరఖాస్తును మరోసారి పరిశీలించిన రెగ్యులేటరీ బోర్డు, తాజాగా దానిని తోసిపుచ్చింది. నిర్ణాయక కమిటీలోని ముగ్గురు సభ్యులలో ఇద్దరు ఆ దరఖాస్తును వ్యతిరేకించారు.