బీఎండబ్ల్యూ కారులో ఒక్కసారిగా మంటలు

నవతెలంగాణ-బంజారా హిల్స్‌
రన్నింగ్‌లో ఉన్న ఓ బీఎండబ్ల్యూ కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడిన ఘటన హైదరాబాద్‌లోని సచివాలయం వెనుక ఉన్న మింట్‌ కాంపౌండ్‌ వద్ద చోటుచేసుకుంది. అయితే డ్రైవర్‌ వెంటనే కారు దిగడంతో ప్రాణ నష్టం తప్పింది. వాహనాదారులు తెలిపిన వివరాల ప్రకారర.. మంగళవారం మింట్‌ కాంపౌండ్‌ వద్ద రన్నింగ్‌లో ఉన్న బీఎండబ్ల్యూ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్‌ వెంటనే కారు నిలిపివేసి బయటకు వచ్చేశాడు. నిమిషాల వ్యవధిలో కారు మొత్తం మంటలు వ్యాపించాయి. జీహెచ్‌ఎంసీ వాటర్‌ ట్యాంకర్‌, అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకుని అక్కడికి చేరుకునే లోపే వాహనం దగ్ధమైపోయింది. ఖైరతాబాద్‌ పోలీసులు మింట్‌ కాంపౌండ్‌ వద్దకు చేరుకుని కాలిపోయిన కారును పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని కారులో మంటలు రావడానికి గల కారణాలేంటి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.