రాములుగారు రాసిన, ‘నక్సలిజం నాకేం నేర్పింది?’ పుస్తకాన్ని చదివాక నా అభిప్రాయం రాస్తున్నాను. ఒక్క వాక్యంలో చెప్పాలంటే,’ఈ పుస్తకం రాసి ఆయన చాలా మంచి పని చేశారు. తెలంగాణాలో 60 ఏండ్ల కిందట గ్రామాల్లో దళిత కుటుంబాల పరిస్తితి ఎలా వుండేదో తెలిసింది. చిన్నతనంలో, ఆయనగానీ, వాళ్ల నాన్నగానీ కులం కారణంగా పడిన అవమానాలూ రాసిన పద్ధతి కదిలించేదిగా వుంది. ‘ఆకలి కన్నా, కులం తాలూకూ అవమానం చేసిన గాయాలే ఎక్కువ’ అని రాములు రాసింది చదివి చాలా బాధేసింది. దళితుల్లో అలాంటి బాధలు పడ్డవారు ఎందరో కదా? కానీ, బాధలూ, అవమానాలూ అనుభవించిన వాళ్ళు, 60 ఏండ్ల తర్వాత ఇలా గుర్తుపెట్టుకుని, రాయగలగడం అందరికీ సాధ్యం కాదేమో! చాలా చిన్నప్పుడు, ఒక పాఠంలో, ‘చండాలుడు’ అనే పదం వచ్చినప్పుడు, ‘చండాలుడు అంటే ఎవర’ని, దళితుడు కాని ఒక పిల్లవాడు అడిగితే, ఆ టీచరు రాములును లేవమని చెప్పి ‘వీళ్ళే’ అని అన్నసంఘటన, ఆయన తండ్రిని విందుకి పిలిచి, దళిత అతిధి విస్తరి తియ్యాల్సి వస్తుందని భోజనం పెట్టకుండా పంపించేసిన సంఘటనా చదివితే ఎంత కష్టం అనిపించిందో! ‘కష్టం’ అనే మాట సరిపోదు. హైస్కూలు రోజుల్లోనే సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళలో చెత్త తిండీ, చిరిగిన చాపల మీద, నల్లుల మధ్య పడకా.. లాంటి సమస్యలమీద మిగతా విద్యార్ధుల్ని కూడగట్టేపని అప్పట్లోనే ప్రశ్నించారంటే ఆయనలో ఒక ‘ఆర్గనైజర్’ వున్నట్టే! ఈ కారణం చేతనే రాములు 50 ఏండ్లకు పైగా రాజకీయాల్లో వుండగలుగుతున్నారు!
ఫుల్ మీల్స్ కోసం అధికారులతో కొట్లాడి సాధించుకోవలిసి వచ్చిందంటే, ప్రభుత్వం ఆ మాత్రం కూడా చెయ్యకుండా వుందన్న మాట! ఇప్పటికీ, ప్రభుత్వం నడిపే సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళలు ఘోరంగా వున్నాయనే వార్తలు తరచుగా చదువుతున్నాం. తిండీ, సౌకర్యాలూ సరిగా వుండవు. తరచుగా కలుషితాహారం వల్ల ఆసుపత్రుల పాలై పోతున్న వార్తలు వస్తున్నాయి. మాల మాదిగ విద్యార్ధుల మధ్య కొట్లాటలు 40 ఏండ్లనాడే వున్నాయంటే, ఇప్పటి పరిస్తితిని అర్ధం చేసుకోవచ్చును. ‘పేదరికం శరీరాన్ని కుంచింపచేస్తది. కులవివక్ష మనసును కలవరపరుస్తుంది’ అని ఆయన రాసినది, ఒక గొప్ప కొటేషన్‌లాగా అనిపించింది. కారణం అది ఆయన సొంత అనుభవం నించి వచ్చింది కాబట్టి!
నలుగురినీ కూడగట్టాలనే దష్టీ, సీపీయం పార్టీలో పనిచేసిన అనుభవం వున్నప్పటికీ, ఆయన సహచరుల మీద మీ ఊరి పెత్తందారుల దౌర్జన్యం, ఆయన నక్సలిజం వైపు మొగ్గడానికి కొంత కారణం అన్నట్టు రాశారు. నక్సలైటు పార్టీలలో చేరి, అగ్నాతంలోకి వెళ్ళిన వారిలో కొంత మంది గ్రామ పెత్తందారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, కోపంతో ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్ళినట్టుగా నేను గతంలో విన్నాను.
50 ఏండ్ల కిందట, ఉత్సాహంగా అడవిలోని దళాల్లోకి వెళ్ళి, తక్కువ రోజుల్లోనే తిరిగివచ్చిన వాళ్ళు రాములుగారితో అన్నమాటలు చూస్తే, అప్పటి నక్సలైట్ పార్టీలు ఇంత అవగాహన లేకుండా ఎలా వున్నాయా అనిపిస్తుంది. ‘అక్కడ ప్రజల సహకారం లేదు’ అని, వాళ్ళు చాలా మాటలు చెప్పారు ఆయనతో. ఆ మాటలు వింటే నిజమేగదా అనిపిస్తుంది ఎవరికైనా! ప్రజల సహకారానికి సంబంధించే, రాములుగారు పార్టీకి రాసిన చివరి ఉత్తరంలో సరైన ప్రశ్నే వేశారు. ‘మన దేశంలో ప్రజల చైతన్య స్తాయిని ఏ విధంగా పెంచాలి? దానికి మొదట అనుసరించవలసిన మార్గాలు అనేకం వున్నాయి. అవన్నీ వదిలి చివరి పోరాట రూపం మాత్రమే తీసుకోవడం ఏ మాత్రం సరియైనది కాదు’ అని ఆయన రాసింది చాలా నిజం. తార్కికం. మరి, ఆ పార్టీవాళ్ళు ఆ తర్వాత ఆ విషయం గ్రహించారో లేదో?
రాములుగారి దళానికీ, ఇంకో నక్సలైట్ పార్టీ దళానికీ ఎదురు కాల్పులు జరిగాయని రాశారు ఒక చోట! నక్సలైటు గ్రూపుల వాళ్ళు ఒకరికొకరు భయంకరమైన వర్గ శతవుల్లా ప్రవర్తించడం ఏమిటి? 30-40 ఏండ్ల కిందట, ఈ గ్రూపుల వాళ్ళు, ఒకర్ని ఒకరు హంతక ముఠాలుగా విమర్శించుకుంటూ, రాసుకున్న పుస్తకాలు చదివినట్టు గుర్తు. అప్పట్లో ఆయనకు వచ్చిన సందేహాల్నీ, విమర్శల్నీ, దాచుకోకుండా అప్పటి పార్టీ నాయకులతో చర్చించడం చాలా మంచి విషయం. చైతన్యం కలిగిన ఏ వ్యక్తి అయినా చెయ్యవలిసిన పని అదే! నక్సలైట్ నాయకత్వం అంబేద్కర్‌ని చదవకుండానే, ఆయనపై దాడి చేసినట్టు రాములు రాశారు. చండ్ర పుల్లారెడ్డితో ఆయనకూ, గూడ చంద్రయ్యకూ జరిగిన సంభాషణని బట్టి ఈ నిర్ణయానికి వచ్చారా, ఇతర గ్రూపులవారు కూడా అలా ఎక్కడైనా రాశారా? అలాంటి రచనలు వుంటే, వాటి వివరాలు ఇవ్వవలిసింది.
భారత దేశపు భౌతిక తత్వవేత్తల గురించి నక్సలైట్ల అవగాహన సరిగా లేదని రచయితకు అనిపిస్తే, వాళ్ళు చార్వాకుల గురించీ, లోకాయతుల గురించీ, బుద్ధుడి గురించీ, ఏమీ చెప్పలేదనో, చెప్పినా అరకొరగా చెప్పారనో విమర్శ వుంటే అది చెప్పుకోవచ్చు. దానికోసం బుద్ధుణ్ణీ, అంబేద్కరునీ తీసుకురానక్కరలేదు. నక్సలైట్ గ్రూపులు, ప్రత్యేకించి ప్రాచీన భారతీయ భౌతిక వాదం గురించి చెప్పివుండకపోవచ్చు. కానీ మార్క్సిస్టు దక్పధంతో, దేబీ ప్రసాద్ చట్టోపాధ్యాయ లాంటి వారు రాసిన వాటిని గతంలో కమ్యూనిస్టుపార్టీల ప్రచురణ సంస్తలే ప్రచురించాయి. వాటిని నక్సలైట్ గ్రూపుల వాళ్ళు వ్యతిరేకించ లేదు.
విప్లవోద్యమానికి కులవ్యవస్త ఆటంకంగా వుందనీ, దానికి కారణం భారత దేశంలో శ్రమ విభజనే కాకుండా శ్రామికుల విభజన వుందనే విషయాన్ని నక్సలైట్లు గుర్తించలేదనీ రచయిత రాశారు. నక్సలైట్ల ప్రచురణలలో నాకు గుర్తున్నంత వరకూ శ్రమ విభజన గురించి వారికి గ్రహింపే లేదు. కానీ రచయిత తన పుస్తకంలో శ్రమ విభజననీ, శ్రామిక విభజననీ వేరుచేసి చూస్తున్నారు. ఒక రకంగా అంబేద్కర్ అవగహననే రచయిత తిరిగి చెప్పారు. శ్రమ విభజన అంటే ‘వేరు వేరు వ్యక్తులు, వేరు వేరు శ్రమలు చెయ్యడం’. శ్రామికుల విభజన అంటే ఆ శ్రామికులే ఎక్కువ తక్కువ తరగతులుగా వుండడం. కొందరు ‘ఎక్కువ మారకం విలువ’ కలిగిన పనులూ, కొందరు ‘తక్కువ మారకం విలువ’ గల పనులూ చేసే పరిస్తితి వుంటుంది. ఇది కూడా అన్ని దేశాలలోనూ వుంటుంది, వుంది. కాకపోతే భారత దేశంలో అది ‘కులాల రూపం’లో వచ్చింది. ఇక్కడ, శ్రామికుల విభజన ‘కుల రూపం’ లో ఎందుకు వచ్చిందో సరైన కారణం, అంబేద్కరుతో సహా ఎవరూ చెప్పలేదు. మార్క్సు కూడా చెప్పలేదు. కాకపోతే మార్క్సు చెప్పింది ఏమిటంటే ‘కుల వ్యవస్త వున్న సమాజంలో శ్రమ విభజన, కచ్చితమైన, స్థిరమైన నియమాల ప్రకారం ఉంటుంది. ఈ రూల్స్‌ని శాసన కర్త నిర్దేశించాడా? కాదు. మొదట ఇవి భౌతిక ఉత్పత్తి పరిస్థితుల నించే పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత చాలా కాలానికి, అవి శాసనాల స్థాయికి చేరాయి’ అంటాడు. కానీ మార్క్సు కూడా అవి అలా శాసనాల స్థాయికి, ఏ కారణం చేత చేరాయో చెప్పలేదు. అలాంటప్పుడు, పరిష్కారం ఎలా వుంటుందీ అంటే: తరతరాలుగా, కొన్ని రకాల (ఉదా: మురికి) శ్రమలు కొన్ని కులాలే చేస్తూ వస్తున్న పరిస్తితి మారాలి. అంటే, సమాజంలో, ఇప్పుడు వేరు వేరు కులాలుగా వున్న మనుషులు, అందరూ వేరు వేరు విలువలు కలిగిన శ్రమలు చేసి తీరే విధంగా శ్రమ విభజనను మార్చాలి. అప్పుడు అందరూ శ్రమలు చేసేవారిగా వుంటారు గానీ, కులాలుగా విడిపడి వుండరు.
‘భారతీయ సమాజాన్ని కేవలం వర్గ సమాజంగానే కాకుండా, కుల-వర్గ సమాజంగా భావించాలని’ రచయిత ప్రతిపాదిస్తున్నారు. ‘కులవివక్ష’ అనే నీచత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రత్యేక సంఘం వుండాలనే రచయిత అభిప్రాయం నూటికి నూరుపాళ్ళూ సరైనది! కానీ, కులవివక్ష వుంది కాబట్టి ఈ సమాజాన్ని కుల-వర్గ సమాజం అనేటట్టయితే, ఈ సమాజంలో స్త్రీ-పురుష అసమానత్వం కూడా వుంది గదా! అలాంటప్పుడు స్త్రీవాదులు, ‘ఇది కుల-వర్గ సమాజం మాత్రమే కాదు, కుల-జెండర్-వర్గ సమాజం కూడా’ అని అనవచ్చును. సరిగా ఆలోచిస్తే కులమైనా, వర్గమైనా, స్త్రీ-పురుష అసమానత్వమైనా, తెలుపు-నలుపు భేదాలైనా, కొన్ని శ్రమ సంబంధాల కూడికలే!
కులాల విషయం : కొన్ని కులాలు, ప్రధానంగా మేధా శ్రమలూ, పైస్థాయి శారీరక శ్రమలూ, మురికిని శుభ్రం చెయ్యవలిసిన అవసరం లేని శ్రమలు చేయడం చూడవచ్చును. కొన్ని కులాలు, మేధా శ్రమల్లో తక్కువగానూ, అట్టడుగు శారీరక శ్రమల్లో, అందులోనూ మురికిని శుభ్రం చెయ్యవలిసిన శ్రమల్లో ఎక్కువగానూ వుండడం చూస్తాం. అంటే అన్ని కులాలలోనూ, శ్రమలు చేసేవాళ్ళున్నప్పటికీ ”పై” కులాల్లో, ఎక్కువ విలువగల శ్రమలు చేసే వాళ్ళు వుంటారు. తక్కువ విలువ గల శ్రమల్లో ‘తక్కువ’ కులాల వాళ్ళు ఎక్కువ సంఖ్యలో కనపడతారు.
భూములూ, పరిశ్రమలూ, ఇతర శ్రమ సాధనాలూ కలిగి తాము ఏ శ్రమలూ చెయ్యకుండా ఇతరుల చేత చేయించే వాళ్ళు (దోపిడీ ఆస్తిపరులు) అన్ని కులాలలోనూ వున్నప్పటికీ ‘పై’ కులాల వాళ్ళే అత్యధిక సంఖ్యలో వుంటారు. ‘కింది’ కులాలలో అయితే ఆస్తిపరులు అతి తక్కువ. కాబట్టి సమాజాన్ని ‘కుల’ అనే విశేషణం చేర్చి మాట్లాడితే సమస్య సరిగా అర్ధం కాదు. ఇదే వివరణ కుల-జెండర్-వర్గ సమాజం అని భావించే వారికి కూడా వర్తిస్తుంది. ఎలా అంటే శ్రమలు చేసే కుటుంబాలలో ఇటు ఇంటి పనీ, అటు బైటి పనీ రెండూ స్త్రీలు మాత్రమే చెయ్యవలిసి రావడం వల్లనే స్త్రీ-పురుష అసమానత్వానికి కారణం. పురుషులు బైటి పని మాత్రమే అందులోనూ, ఎక్కువ విలువ గల పనులలో కనిపిస్తారు. స్త్రీలు మొత్తంగా చూసినప్పుడు తక్కువ విలువలు గల పనుల్లో వుంటారు.
చివరిగా.. 1976లో అప్పుడున్న పార్టీవారికి రాములుగారు రాసిన ఉత్తరంలోని విషయాలన్నీ మాట్లాడుకోలేము గానీ, ఒక్క విషయం గురించి చెప్పాలి. ఆ పార్టీవారు చైనాని గుడ్డిగా అనుసరించి, అమెరికాను సమర్ధించి, సోవియట్‌ని వ్యతిరేకించాలనే పాలసీతో వున్నారే, అది తప్పే. అలాగే సోవియట్ యూనియన్‌నీ, దాని మిత్ర దేశాల్నీ సోషలిస్టు శిబిరంగా రచయిత భావించడం కూడా తప్పే. ఎలా అంటే ఆ నాటికే (1976 నాటికే) అమెరికా పూర్తిగా ప్రైవేటు పెట్టుబడిదారీ విధానంతో వుంది. సోవియట్ యూనియన్ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానంతో ఇంకా చెప్పాలంటే, చార్లెస్ బెతల్ హాం తన పరిశోధనా గ్రంధంలో ఆధారాలతో చూపినట్టు పార్టీ పెట్టుబడిదారీ విధానంతో వుంది. చైనాలో కూడా 1973 నాటికే కొద్దిపాటి శక్తితో వున్న ‘విప్లవ’ పంధా బలహీనపడి 1975 నాటికి చైనాలో వెనకడుగులు మొదలైనట్టు, 1976 లోనే, బెతల్ హాం గ్రహించి చెప్పాడు. దానికి ఆయన ఆర్ధిక, రాజకీయ రంగాలలో కనిపించిన ‘వెనకడుగుల్ని’ మనకి చూపించాడు.
‘కార్మిక వర్గ నియంతత్వం’ అనే మాట జనాలకి తప్పుగా అర్ధం అవుతుంది కాబట్టి, ‘నియంతత్వం’ అనే మాటని వాడకూడదు’ అనే రచయిత వాదనలో, బాగోగులు చర్చించాలంటే అది ఒక పెద్ద వ్యాసమే అవుతుంది. నా అభిప్రాయాలు, ‘తత్వ శాస్త్రం’ అనే నా పుస్తకంలో ‘కార్మికవర్గ విప్లవ నియంతత్వం’ అనే చాప్టరులో కొంత రాశాను. వీలైతే ఇంకోసారి దానిమీద ఒక వ్యాసం రాయాలేమో! రాస్తానేమో!
మొత్తానికి రాములుగారి పుస్తకం వల్ల అనేక విషయాల మీద చర్చించుకోవడానికి అందరికీ వీలవుతుంది. ఈ పుస్తకం వల్ల చాలా ఉపయోగం వుంది. ఇంకో మాట: నక్సలైటు పార్టీని వదిలి మొట్టమొదట్లో పనిచేసిన సీపీయం పార్టీలోకి తిరిగి వచ్చారు కదా? ఈ పార్టీలో అనుభవాలు ఏమిటి? అవి కూడా ఒక పుస్తకంగా రాస్తే బాగుంటుంది. ఉద్యమాల్లో పనిచేసే వారికి ఉపయోగంగా వుంటుంది.
రంగనాయకమ్మ