
నవతెలంగాణ – సిద్దిపేట
మెదక్ లోకసభ కు జరుగుతున్న ఎన్నికలలో సీపీఐ(ఎం) పార్టీ సంపూర్ణ మద్దతును కాంగ్రెస్ కు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ లభించిందని చెప్పవచ్చు. ఇప్పటివరకు మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉన్నట్లు ప్రచారం జరిగినప్పటికీ సీపీఐ(ఎం) నీలం మధకు సంపూర్ణ మద్దతును ప్రకటించడంతో వీరు ఓట్లు నిర్ణయాత్మకం కానున్నాయి. మెదక్ లోకసభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. ఇందులో ఆరు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మెదక్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కి చెందిన రోహిత్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఏడు నియోజకవర్గాలలో సీపీఐ(ఎం) పార్టీకి ఒక ప్రత్యేకమైన, నిర్దిష్టమైన క్యాడర్ ఉంది. దీంతో మెదక్ లోకసభ కు పోటీ చేస్తున్న అభ్యర్థులకు వీరు ఓట్లు నిర్ణయాత్మకం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
నియోజకవర్గాలలో చేరికలతో ప్రభావం..
మెదక్ లోకసభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్, పటాన్ చెరు, సంగారెడ్డి, నియోజకవర్గలలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మెదక్ అసెంబ్లీకి మాత్రం కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అన్ని నియోజకవర్గాలలో వివిధ పార్టీల నుండి ముఖ్య నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈ చేరికలు కాంగ్రెస్ అభ్యర్థికి కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయి. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు అన్నచందంగా కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు సిపిఐ (ఎం) మద్దతు మరింతగా కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు.
సీపీఐ(ఎం) కు ప్రత్యేకమైన క్యాడర్..
కార్మికుల పక్షాన ఏ సమస్య ఉన్న తాను ఉన్నానంటూ వారికి మద్దతుగా ఉండే పార్టీ సీపీఐ(ఎం) ప్రభుత్వ, ప్రవేట్ రంగాలలో, పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్న పార్టీ సీపీఐ(ఎం) మెదక్ లోకసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలలో ఏ పార్టీ వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ సీపీఐ(ఎం) కు ఒక ప్రత్యేకమైన క్యాడర్ ఉందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటే గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు కూడా వారు చెప్పిన నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతో ఏడు నియోజకవర్గాలలో గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న నాయకత్వం సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ కు లభించినట్టు. వీరి ఓట్లు అభ్యర్థులకు కీలకం కానున్నాయని, వారి గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పవచ్చు.